పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసంతసేన : అంత ప్రియమైన హారాన్ని మా నగల పాత్రకు ప్రతిగా ఇవ్వటము మా మహాభాగ్యము.

మైత్రేయుడు : (మదనికకు హారాన్ని ఇవ్వలేక ఇచ్చి లేచి కొల్లాయిగుడ్డ విదిలించుకొని పనైపోయిందన్నట్లుగా) అమ్మాయీ! వచ్చినపని పూర్తి అయింది. ఇక లేవనా, దేవతార్చనకు ప్రొద్దుపోతున్నది.

వసంతసేన : ఆర్యా! నేను ప్రదోషసమయంలో మీ మిత్రుల దర్శనానికి వస్తున్నానని నాకై సెలవీయండి.

మైత్రేయుడు : ఆఁ. (కానీ రానీ అన్నట్లు) అలాగా.

(నిష్క్రమిస్తాడు)

మదనిక : (హారం వసంతసేన చేతిలో పెడుతూ) చాలా ఆనందంగా ఉంది అక్కా! ఒక్కమాటు మెళ్లో వేసుకో చూస్తాను.

వసంతసేన : అమ్మాయీ! మైత్రేయులవారిని అందాకా పంపించిరా ?

మదనిక: (మాట్లాడకుండా వెళ్లుతుంది).

వసంతసేన : హారాన్ని పరిశీలిస్తూ - చారుదత్తుని చిత్రపటం వైపు చూస్తూ)

(*) ప్రభూ! ఈ పాద సేవకురాలిమీద, నీ శీతలామలస్నిగ్ధ దృష్టి పడిందా, ఈ నీరసశుష్కజీవితం ప్రణయప్రమదావన మౌతుంది.

సంవాహకుడు : (ఆవేగంతో ప్రవేశించి) అమ్మా! రక్షించండి! రక్షించండి!! (కాళ్ళమీద పడతాడు)

వసంతసేన : ఎవరు నీవు? ఎలా వచ్చావిక్కడికి? - దొడ్డి దారినా?

సంవాహకుడు : (ఔనన్నట్లు తల ఊపి) అమ్మా! ప్రధాన జూదరి మాధురుడికి పదిసువర్ణాలు ఆటలో అప్పు పడ్డాను. (తెరలో) ఓరి బయటికిరా! వస్తే బ్రతకవు, పది సువర్ణాలూ కక్కిస్తా - (తలుపుకొడ్తూ) అమ్మా! తలుపు బ్రద్దలు కొట్టి వస్తాడేమో! రక్షించు తల్లీ! నీ ఋణం తీర్చుకుంటాను.

వసంతసేన : ఎవరు నువ్వు? -

—————————————————————

వసంతసేన

163