పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/161

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధనిక : అక్కా! ఈ జన్మలో నిన్ను మరచిపోలేను. ఎప్పుడూ కృతజ్ఞురాలినిగా ఉంటాను. అక్కా! అటు చూడు - మైత్రేయులు. వసంతసేన : అమ్మాయీ! లేచివెళ్ళి వారిని తీసుకోరా వెంటఉండి - మదనిక : (ఎదురుపోయి తీసుకోవస్తుంది. వసంతసేన వారు వచ్చేవరకూ అటే చూస్తూ ఉంటుంది.) వసంతసేన : (లేచి సగౌరవంగా నిలవబడి) ఆర్యా! ఆ ఆసనమలంకరించండి. మైత్రేయుడు : (ఎబ్బెట్టుగా కూర్చుని) అమ్మాయీ! నీ ఇల్లు కాదుగాని నా ఒళ్లు గుల్లయిపోయింది. ఎక్కే గడప, దిగే గడప, కూర్చుంటే గడప, లేస్తే గడప, అసలే ఐరావతం లాంటి మనిషినా! అడుగులో అడుగు పెట్టుకుంటూ అరటిపండు తొక్కమీద కాలుపడ్డట్టు జర్రున జారుకుంటూ, పడుతూ లేస్తూ పైకి వచ్చేటప్పటికల్లా ప్రాతఃసంధ్య వార్చుకొని బయలుదేరితే, మాధ్యాహ్నిక సంధ్యకు వేళ తప్పుతూ ఉన్నది. ఇంట్లో ఉంటే ఈ పాటికల్లా తవ్వెడు నువ్వులు తిలోదకాలకు పూర్తి చేసేవాణ్ణి. డబ్బుంటే ఇలా గోడలకూ, గొబ్బెలకూ పెట్టకపోతే... (సర్దుకొని కూర్చుంటాడు). వసంతసేన : ఇంత లోగిలి కట్టుకొని తమబోటి పెద్దవారికి మిక్కిలి శ్రమ ఇచ్చాను. మైత్రేయుడు : (సర్దుకొంటూ) పరిహాసాలకేం గాని అమ్మాయీ! నీ యిల్లు చూచిన తరువాత ముల్లోకాలూ ఇందుమూర్తీభవించినవా అనిపిస్తున్నది. కుబేరభవనం దీని ముందు గుడ్డిగవ్వకు పనికిరాదు. వసంతసేన : ధన్యురాలిని. మైత్రేయుడు : కూర్చో అమ్మాయీ! నిలబడ్డావు? వసంతసేన : (కూర్చొని) ఆర్యా! మీ మిత్రులు కుశలమేనా? మైత్రేయుడు : మా చారుదత్తుడికి కుశలమే కాని, అతని నామసార్థక్యానికి ఈ మధ్య కొన్ని అవాంతరాలు వచ్చినవి. వసంతసేన : ఆ సజ్జన మహావృక్షాన్ని ఎవరూ నీడకోసం ఆశ్రయించటం లేదా? మైత్రేయుడు : (దైన్యాన్ని సూచిస్తూ తలవంచుకుంటాడు), వసంతసేన 161