పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/148

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనిక : ఇంకా ఏం చెప్పమంటావు, చెపితినిగా.

వసంతసేన : ఏం చెప్పావు? - పోనీ ఈ చిత్రం ఎలా ఉందో చెప్పు-

మదనిక : (పూర్వవిధంగా) నీకోరిక తీర్చటానికి... నిశ్చల ప్రేమతో... నిర్మల హృదయంతో - పురివిప్పి నిలచిన నెమలిలా - పురుష పుంగవుడు అలంకరించుకొని ఆర్యచారుదత్తులు వచ్చి కూర్చున్నట్లున్నది. (నవ్వుపుట్టించే టట్లుగా) అక్కా ఆ భంగిమలో ఆర్యుల కన్నులనుంచి అమృతవృష్టి కురుస్తున్నట్లున్నది.

వసంతసేన : ఆర్యుల కరుణారసప్రదనేత్రాలను కమనీయంగా చిత్రించానా?

మదనిక : నీకు అనుమాన మెందుకు, నేను చెప్పటమెందుకు? నీ కుంచె ఆవిశాలశతపత్రనేత్రాల మీదికి పోకపోవటమే చెప్పుతున్నది.

వసంతసేన : (నవ్వి) వారి విశాలవక్షఃప్రదేశానికి లోపం -

మదనిక : ఊఁః - అణుమాత్రం రాలేదు - అయితే నీ గాఢాలింగన కౌతూహలం నీచేత మరింత కర్కశంగా చిత్రించేటట్లు చేయించిందేమోనని అనిపిస్తున్నది.

వసంతసేన : (కుంచెతో ఒక చుక్కపెట్టి) ఇప్పుడో!

మదనిక : ఆఁ. ఆయన సహజరూపం. చక్కగా సరిపోయిందక్కా! ఒక మాటు లోపలికివెళ్లిరా, నీవే వారనుకోని పలకరిస్తావో లేదో!

వసంతసేన : ఇచ్చకాలాడకు, మదనికా! చిత్రం నీకు ఎక్కడ నచ్చక పోయినా చెప్పు.

మదనిక : (పరిహాసం మాని నిశ్చలంగా) మనస్ఫూర్తితో చెప్పుతున్నాను. ఇందాక నీవు చేసిన మార్పుతో -

వసంతసేన : (అనునయిస్తూ) మార్పుతో,

మదనిక : నేను చెప్పటమెందుకులే!

వసంతసేన : పోనీలే -

మదనిక : అక్కా! నీ కర్ణమైందో లేదోగాని నీ హృదయం కూడా లగ్నమైంది.

వసంతసేన : (పటాన్ని చూచి మురిసిపోతూ) చిత్రాలు గీయటం ప్రారంభించి చివరకు ఏడాది కూడా కాలేదు గదా! అప్పుడే ఇంత సజీవ చిత్రాన్ని సృజించగలిగానా?

——————————————————————

148

వావిలాల సోమయాజులు సాహిత్యం-2