శర్విలకుడు : (తల త్రిప్పుతాడు, లేదన్నట్లు)
మదనిక : ఈ హారం మా అక్కగారిదే - ప్రదోషసమయంలో ఆమె మదనాలయం నుంచి వస్తూ ఆర్యచారుదత్తులకు దాచి పెట్టమని యిచ్చింది, కొన్ని అలంకారాలు.
శర్వీలకుడు : (ఆశ్చర్యంతో) ఏమిటీ! -
మదనిక : ఇలారా! (దగ్గరకు వచ్చిన శర్వీలకునితో చారుదత్త వసంతసేనల ప్రణయగాథను గురించి చెప్పుతుంది)
శర్వీలకుడు : ఎండ వేడి సహించలేక ఏ కొమ్మను ఆశ్రయించుకొన్నానో దాని ఆకులే రాల్చానన్నమాట! (క్రింద చూస్తూ) అయితే ముందు కర్తవ్యమేమిటి?
మదనిక : తీసుకోపోయి ఏదోవిధంగా ఆర్యచారుదత్తులకే చేర్చటం మంచిది.
శర్వీలకుడు : న్యాయాధిపతులకు చెప్పి శిక్ష విధిస్తే?
మదనిక : పిచ్చివాడా! చంద్రుడు ఎండకాస్తాడా! ఆర్యచారుదత్తులను ఎరగనట్లు మాట్లాడుతున్నావు.
శర్విలకుడు : (అది ఇష్టము కానట్లు ప్రవర్తిస్తాడు)
మదనిక : అయితే మరొకపని చేయటం మంచిది.
శర్విలకుడు : ఏమిటది?
మదనిక : ఆర్యచారుదత్తులే పంపినట్లుగా హారాన్ని అక్కకు చేర్చు. అప్పుడు ఆయన ఋణవిముక్తుడౌతాడు. నీవు దొంగవూ కావు ప్రేమ ఉంటే పరిణయం మాట పరమేశ్వరుని కృప - ఇది మన విషయం.
శర్వీలకుడు : మదనికా! ఇది నీ సౌశీల్యానికి తగ్గ ఊహ. నీ ప్రేమ నాలో పశువును మానవుడిగా పరిణమించిటట్లు చేస్తున్నది. మన వివాహానంతరం నాకే దివ్యత్వం తెచ్చి పెడతావో!
మదనిక : (అతని చేయి అందుకొని ముద్దు పెట్టుకుంటుంది) అదిగో, ఆ మావిగున్న చాటున కూర్చో - నేను లోపలకు వెళ్లిన పది నిముషాలలో తలుపు తడితే మా అక్కతో సమయానికి నిన్ను గురించి చెప్పవలసినమాట చెప్పి లోపలికి తీసుకోనెళ్లుతాను.
——————————————————————————
145