పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/144

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శర్విలకుడు : మీ అక్క వసంతసేన.

మదనిక : ఇంట్లో పెత్తనమంతా ఆమె తల్లిది. మా అక్కమాటే సాగితేనా, పరిచారకుల నందరినీ ఊరికే విడిపిస్తుంది - కానీ నన్ను విడిపించేటంత ధనం నీకు ఎక్కడినుంచి వచ్చింది.

శర్వీలకుడు : మదనికా! నీమీద ప్రేమ నా చేత ఒక సాహసకృత్యం చేయించింది.

మదనిక: ఆఁ! సాహసమా!!

శర్విలకుడు : అది కేవలం సాహసకృత్యమే కాదు పాపకృత్యం కూడాను రాత్రికి అప్రతిష్ఠ తెచ్చిపెట్టాను. కాని శ్రమకు ఫలితం మాత్రం దొరికింది - ఇదిగో హారము! - (రొండిన దోపినమూట సంచినుంచి బయటికి తీస్తాడు)

మదనిక: (ఆశ్చర్యంతోనూ అన్వేషణగా) ఆఁ, శర్విలకా!

శర్విలకుడు : (హారంవైపు తదేకదృష్టితో) ఉస్ - వసంతసేన కిచ్చి ఆమెతో అప్పుడప్పుడూ ఉపయోగించమని చెప్పి నిన్ను విడిపించుకో. మనమిద్దరమూ వివాహం చేసుకొని సంతోషంగా కాలం గడుపుదాము.

మదనిక : (హారంమీదనే కళ్లు నిలిపి చూస్తూ) ఏదీ హారం?

శర్విలకుడు : (చేతికందిస్తాడు)

మదనిక : (పరీక్షిస్తూ) ఎక్కడో చూచినట్లుంది, నీకిది ఎలా దొరికింది?

శర్విలకుడు : అదంతా నీకెందుకు? ఇది తీసుకోవెళ్ళి ఆమెకిచ్చి నిన్ను విడిపించుకో!

మదనిక: ఈమాత్రం రహస్యం చెప్పటానికే నమ్మలేకపోతే ఇక మనమేమి వివాహం చేసుకుంటాము. మనస్సులో మనస్సు కలిపి సుఖపడతాము.

శర్వీలకుడు : చారుదత్తుడి ఇంటికి ఎవరో దొంగలు కన్నం వేశారని జనం చెప్పుకోటం వినలేదూ?

మదనిక: (ఆవేగంతో) ఆ పని చేసింది నీవేనా? - ఆ యింట్లో ఎవరినీ కత్తితో పొడవలేదు కదా?

శర్వీలకుడు : (దీనాననంతో తల త్రిప్పుతాడు)

మదనిక : గాయపరచలేదు గద?

————————————————————

144

వావిలాల సోమయాజులు సాహిత్యం-2