శకారుడు : నా ఇంటికి నేను వెళ్లుతుంటే ఓసి గడుగ్గాయ. కసికందువు నీవెవరే ఆపటానికి?
మదనిక : మీ ఇల్లు!
శకారుడు : (మొలలోనుంచి హారం బయటకు తీసి) మరదలూ ఇదిగో ఇటు చూడు, మొన్న మీ అక్కయ్య నీకొక మంచిహారం చేయించమంటే చేయించాను. ఇలారా, నీ మెళ్లో వేస్తాను.
మదనిక: (తానే చేతితో అందుకొని మెళ్ళో వేసుకుంటుంది)
శకారుడు : అమ్మాయీ! ఇక ఎంతసేపు మనం ఈ వాకిటి ముందు, లోపలికి పోదాం పద.
మదనిక : ఏమండోయ్! ఇప్పుడే మా అక్కయ్య ఎక్కడికో వెళ్ళింది.
శకారుడు : (ఆశ్చర్యంతో - ఉద్వేగంతో) వెళ్ళిందా? ఎప్పుడు? ఎలా? ఎక్కడికి? ఆమెను పిల్చుకురా! పోనీ నన్నే అక్కడికి ఈడ్చుకోపో.
మదనిక : (బిక్కమొగంతో) మా అక్కయ్యకు గొప్ప జ్వరం వచ్చింది.
శకారుడు : (త్వరలో) అయ్యో! ప్రియా! సమపీనస్తనీ ఆస్తి నాస్తి!! నేను గొప్ప వైద్యుణ్ణి మరదలూ! నాడీ పరీక్షలో నరికినా దొరకను. మదన జ్వరమైతే మనం వెళ్లుతున్నాం కాబట్టి మందే అవసరం లేదు. జాతి జ్వరమతై నా కుప్పెకట్టు పని చేసినట్లు పని చేయటానికి మరోవైద్యుని సంచికట్టులోనే కుప్పెకట్టు దొరకదు. పాపం, త్వరగా పోదాం పద. ఎంత బాధ పడుతుందో!
మదనిక : అ హం హఁ! ఇది నిన్నటి ఉదయం సంగతి. ఆమె ఇప్పుడు దేవతా మందిరంలో పూజ చేసుకుంటుంది.
శకారుడు : అమ్మాయీ! కావలసినంత డబ్బు తెచ్చి యిచ్చే దేవుణ్ణి నేనుంటే మీ అక్క మరొక దేవుణ్ణి పూజించటమా! మంచి పని కాదన్నానని చెప్పు. డబ్బుకు దానికేం కొదవ దేశంలో. డబ్బంతా బొక్కసంది. బొక్కసం రాజుగారిది. రాజు మా అక్కది. మా అక్క నాది. నాది మీ అక్కది. లోపలికి పోదాం పద.
మదనిక : పోయినా - మాట్లాడదుగా ఎవరితోటీ?
శకారుడు : ఎవరితోనూ మాట్లాడదు గాని నాతో మాట్లాడుతుంది.
————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2