పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/141

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరో దృశ్యం

(వసంతసేన ఇంటిముందు) శకారుడు అలంకరించుకొని వచ్చి అటూ ఇటూ తిరుగుతూ ఈ క్రిందిపదం పాడుతుంటాడు)

పప్పు, పప్పా, పప్పా, పప్పు!
పల్లేవోణ్ణి, పప్పా, పప్ప!
పడవా నడిపే పల్లేవోణ్ణి
దడవాబోకే పల్లెపడుచా!
దాటేస్తానే పల్లెపడుచా!!
పప్ప, పప్పా, పప్పా, పప్పు!

(లోపలికే వేగంగా పోబోతుంటే)

మదనిక : (ఆపుతూ) ఎవరండోయ్! ఆగండక్కడ!!

శకారుడు : (మంచి చేసుకొనే గొంతుకతో) ఓహో! నీవా పిల్లా! ఇక్కడున్నావేం, రా లోపలికి పోదాం.

మదనిక : ఎవరు మీరు? ఏమిటీ చనువు?

శకారుడు : నీవెవరో చెప్పు చూతాం.

మదనిక : వసంతసేన మా అక్కగారు!

శకారుడు : అయితే నీకు నేను బావగారిని, మరదలూ! నేను మా అక్కగారి తమ్ముణ్ణి. మా అక్కగారే రాజుగారిని ఉంచుకున్నారు. ఓస్ చిన్నదానివే. నీకింకా ప్రపంచజ్ఞానం లేనట్లుంది. - నే నెవరినో ఎరగనట్లున్నావు. శకారమహారాజులుంగారని వినలేదూ? (మనిషి ప్రక్కగా లోపలికి తోసుకోపోబోతాడు)

మదనిక : అయ్యా! ఎక్కడికా తోసుకోపోవటం?

——————————————————————————

వసంతసేన

141