పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/133

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదో దృశ్యం

(నిద్రాసమయం - చారుదత్తుని ఇల్లు - అతడు వీణ వాయించుకుంటుంటాడు. ఆ తరవాత చిరిచాపమీద మైత్రేయుడు, మంచంమీద చారుదత్తుడు నిద్రకాయత్త పడుతారు)

చారుదత్తుడు : అనేక వాద్యాలు విన్నాం గాని, మైత్రేయా! వీణ మాత్రం సాగరంలో పుట్టని జాతిరత్నమోయ్!... ఓహో! రేఖిలుడు ఎంత చక్కగా వీణ వాయించాడు.

మైత్రేయుడు : (చాపమీద కాళ్ళు చాచుకొని మోకాళ్ళవరకూ ముసుగుపెట్టి కూర్చొని) చాలు, చాల్లే. మొగవాడికి సంగీతం ఆడదానికి సంస్కృతమూ! ఆడది సంస్కృతం చదువుతుంటే ముక్కుకు తాడుబోసిన ఆబెయ్య అరిచినట్లు బ్యా, బ్యా, అంభా అన్నట్లు వినిపిస్తుంది. మొగవాడు సంగీతం పాడుతుంటే శుద్ధ శ్రోత్రియుడు బోసినోటితో 'సహనా వవతు, సహనౌ భునక్తు' అన్నట్లు వినిపిస్తుంది.

చారుదత్తుడు : (నవ్వుతూ) మైత్రేయా! జాగ్రత్త. నీవు అనవసరంగా ఆడవాళ్ళ జోలికిపోబోకు. వెనుకటి దినాలు కావు సుమా!

మైత్రేయుడు : అయితే నాకేం భయం ఆంజనేయులవారి వంటి అనాది బ్రహ్మచారిని.

చారుదత్తుడు : మైత్రేయా! నీవు తప్ప నిన్నటిసభలో రేఖిలుడి పాట మెచ్చుకోనివాళ్లు ఎవరూ ఉండరు.

మైత్రేయుడు : నాకేం లోపం కాదులే, వజ్రశుంఠ వాడి ముష్టిపాట మెచ్చుకోకపోతే! (చాపమీద వెన్ను వాల్చి ముసుగు పెట్టబోతూ) తన్నులు తిన్న గాడిదలా చాపమీద ఎంతసేపు పొర్లాడినా నిద్రపట్టేది కాదు. ఈ దినం ఎందుకో ముంచుకోవస్తున్నది. (ఆవలిస్తూ చిటికలు వేస్తూ!) ఇదిగో! మరిచిపోయినా, దాని నగల పాత్ర! వర్ధమానకుడి కిచ్చి జాగ్రత్త చేయించు. ఇవాళ నాకు ఒళ్లు తెలియని నిద్ర వచ్చేస్తున్నది.

చారుదత్తుడు : మైత్రేయా! దానిని రాత్రిళ్ళు భద్రపరచవలసింది నీవే.

———————————————————————————

వసంతసేన

133