పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/131

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరిగినా సాయంత్రానికి తవ్వెడు గింజలు అప్పు పుట్టటం లేదు. నాకేమిటో బెంగగా ఉంది. అక్కయ్యగారు తలెత్తి మాట్లాడుతుంటే చూడలేకుండా ఉన్నాను.

మైత్రేయుడు : అమ్మాయీ! మనకేం భయంలేదు. నాతంటాలు నేను పడి పట్టించుకో వస్తానుగా! నీవు ఎవరెవరి ఇళ్లకు పోయివస్తున్నావో చెప్పు.

రదనిక : పిరాట్లవారింటికీ,

మైత్రేయుడు : లేవన్నారా?

రదనిక : ఇంట్లో పిల్లలెవరూ లేరట, ఆమె మడి కట్టుకున్నదట!

మైత్రేయుడు : కూర్చొని నెత్తిన గుడి కట్టుకోకపోయిందీ?

రదనిక : పురుషోత్తంవారింటికి పోతే పురుడొచ్చింది అప్పుసొప్పులు లేవన్నారు. గోరంట్లవారింటికి పోతే ఈ పూటకు సోలెడైతే పెట్టానన్నది కామమ్మ.

మైత్రేయుడు : (ఆశ్చర్యంగా) ఆఁ ఆఁ (నోటిమీద చెయ్యి వేసుకొని) నిన్న అచ్ఛాశాస్త్రులు గాడిదమోత బియ్యం మూట నెత్తిన వేసుకొని ఇంటికి వస్తుంటే నేను కళ్లారా చూచాను. చారుదత్తుడి ఇంట్లో ఎవరి బాబు సొమ్మున్నదని వెనక ఏళ్ళ తరబడి మేశారో! తవ్వెడు గింజలు అప్పివ్వటానికి దడిచారూ! ఓరి వీళ్లతాడు తంగెళ్ళలో తెగ!

రదనిక : బాబయ్యా! తిట్టు తిమ్మై తగులుతుంది. ఏం ప్రయోజనం? భగవంతుడు వాళ్ళనోట అలా పలికిస్తున్నాడు.

మైత్రేయుడు : (దైన్యంతో) అమ్మాయీ! చారుదత్తుణ్ణి, అతని ఆప్తులమైన మననూ పరమాత్మ పరీక్షిస్తున్నాడు. కానీ కలకాలం కాని దినాలుండవు. ఆనాడు వీళ్ళంతా మన ఇంటికి అప్పుకు రారా? ఎవళ్ళసొమ్ము ఇక్కడ పాతిపెట్టలేదని మొఘాన పట్టుకొని ఎత్తిపొడవనా! ఏదీ (బుట్టను ఉద్దేశించి) ఇలాతే. ఎలా పుట్టవో, ఎందుకు పుట్టవో, ఎన్నాళ్ళు పుట్టవో చూస్తాను. ఇది ఇంటికి పట్టుకోపో. (మజ్జిగ తప్పేలా అందిస్తాడు)

రదనిక : (అందుకొని పరీక్షిస్తూ) ఇవేనా ఊళ్ళో దొరికిన మజ్జిగన్నీ?

మైత్రేయుడు : ఇవేనా? ఇంకానయం ఇవన్నా దొరికినై. ఇందుకు సంతోషించు. నా మొఘం చూచేటప్పటికి గేదె తన్నిందనీ, ఎండిపోయినదనీ, పాలు కాటుకపోయినవనీ,పిల్లి తాగిపోయిందనీ, పొంగుపోయినవనీ - వెనక 'చంద్రికాధౌతం దధి' అయితే గాని నాకు ముద్ద దిగేది కాదు గొంతు. ఇప్పుడో మంచినీళ్ళలో ఉప్పు వేసుకొని

——————————————————————

వసంతసేన

131