పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/123

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసంతసేన : (అతివినయంగా) దేవపురుష మనుష్యులేమిటి? దేవ దానవ పురుష మనుష్యులు - మహాత్ములు!

కుంభీలకుడు : మా అమ్మాయికి మీ గొప్పదనం ఇప్పటికర్థమైంది!

శకారుడు : (కుంభీలకుణ్ణి దూరంగా పొమ్మని హస్తసంజ్ఞ చేస్తూ) వసంతసేనా! మీ అన్నమీద ఒట్టు నిన్ను వెన్నాడటంలో నేను ఎంతో అలిసిపోయినాను, సొలసి పోయినాను! దేవీ! కేతకీదళకఠోరవల్లీ! (ముఖం తేలవేస్తూ ప్రేమకుమారం చేస్తాడు).

వసంతసేన : ఏమిటా వెకిలిచేష్టలు! ఎవరనుకున్నావో! - నడు అవతలికి - (గద్దిస్తూ) ఉఁ.

శకారుడు : (కోపంతో) బావా! ఏమిటి మీ చెల్లెలి బెదిరింపు? నేనేమి వాడొదిలిపెట్టినానా, కాడొదిలిపెట్టినానా? ఎక్కడికి పొమ్మంటుంది? - చూడ బోతే చేయి చేసుకుండేదాకా మాట వినేటట్టు లేదు.

కుంభీలకుడు : (వసంతసేన దగ్గరికి వచ్చి) అమ్మాయీ! మా ప్రభువుగారి కంటే నీకు మంచి రసికులు ఎక్కడ దొరుకుతారని.

వసంతసేన : అయ్యా! అనురాగానికి యోగ్యత అవసరం.

శకారుడు : అఁ- ఆ దరిద్రచారుదత్తుడి కున్నంత యోగ్యత వరపురుషుణ్ణి వాసుదేవుణ్ణి నాకు లేదన్నమాట! బావా! ఇది క్షమింపరాని అవమానం అని చెప్పు.

కుంభీలకుడు : (నిష్కర్షగా) అమ్మాయీ ఇది క్షమింపరాని అవమానం!

వసంతసేన : రాచబాటలో బలాత్కారం చేయటం భరింపరాని అవమానం.

శకారుడు : బావా! ఇక ఇది మనమాట వినదు. (దగ్గరకు పోయి చేయి పట్టుకుంటాడు)

వసంతసేన : (విదలించి పెద్దగొంతుకతో) పల్లవికా! పరభృతికా! మధురికా! (దూరంగా రదనిక మైత్రేయుడు బల్యన్నంతో ప్రవేశిస్తారు)

శకారుడు : బావా, ఎవరో మనుష్యులు!

కుంభీలకుడు : (జారుకుంటాడు)

శకారుడు : బావా! బావా!

వసంతసేన : (గొంతు పెద్దదిచేసి) పల్లవికా! పరభృతికా!!

—————————————————————————

వసంతసేన

123