పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/122

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శకారుడు : ఆడవాళ్ళనేనా?

కుంభీలకుడు : ఉఁ.

శకారుడు : (ధైర్యంతో) రానీ, వందలకొద్ది రానీ చూడు, మరి మన ప్రతాపం! (మీసం మీదికి చేయిపోనిచ్చి గొంతు సవరించుకొంటూ అడుగు ముందుకు వేస్తాడు)

వసంతసేన : (భయకంపంతో) మధూ! మధుకరికా!!

శకారుడు : బావా! బావా!!

వసంతసేన : (వెనుకకు నడుస్తుంటుంది)

శకారుడు : (ముందుకు నడిచి) (*) నీ వెంటపడి నేను తరుముతుంటే ఆపటానికి కుంతికొడుకైన ఆ శంతనుడికీ, రంభ కొడుకైన ఆ రావణాసురుడికీ ఇద్దరికీ చేతకాదు. మరింకెవ్వరికి శక్యం? నీ పల్లవిక, నీ పరభృతిక, మధు, మధుకరిక నన్నేమి చేస్తారు? (చెయ్యి పట్టుకోబోతాడు).

వసంతసేన : (యుక్తిగా) అయ్యా! నేను అబలను.

కుంభీలకుడు : అమ్మాయీ! నీకేమీ భయంలేదు.

శకారుడు : బావ చెప్పినట్లు, ఆఁ, నీకేమి భయంలేదు.

వసంతసేన : (గౌరవాన్ని నటిస్తూ) మీరు మహాత్ములు! తెలుసుకోలేక పోయాను. (నగలు తీసి యివ్వబోతుంది)

కుంభీలకుడు: (శకారుడివైపు చూస్తూ) మా ప్రభువుగారు నీ అలంకారాలకు ఆశపడేవారు కాదమ్మాయీ!

శకారుడు : (సదర్భంగా) మనమే ఇటువంటి అలంకారాలు అనేకమంది అమ్మాయిలకు అడిగించుకోకుండా ఇచ్చామని చెప్పవోయ్! వసంతసేన : అయితే మరి నన్ను నాదారిని -

శకారుడు : ఎక్కడికి?

వసంతసేన : నా ఇంటికి?

శకారుడు : (ఠీవిగా) పిల్లా! నేను దేవపురుష మనుష్యుణ్ణి!

———————————————————————————

122

వావిలాల సోమయాజులు సాహిత్యం-2