పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/116

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జంధ్యానికి బ్రహ్మముడి పూర్తి చేసుకుంటుంటాను. నీవు వెళ్ళి పూజించి ఆయన వేసే పుట్టెడు బాణాలు నీమీదనే వేయించుకో.

చారుదత్తుడు : (విగ్రహం చేరువకు నడిచి, సాష్టాంగపడి లేచి మోకరిల్లి ప్రార్థిస్తాడు)

శంభు స్వయంభు హరయో హరిణేక్షణానాం
ఏనా క్రియంత సతతం గృహకుంభదాసాః
వాచామగోచర చరిత్రవిచిత్రితాయ
తస్మై నమో భగవతే కుసుమాయుధాయ

(ఒక పాత్రలో ఉన్న పుప్పొడి చేతికందుకొని కళ్ళ కద్దుకొని శిరస్సుమీద ఉంచుకుంటాడు. మరికొంత చేత్తో పుచ్చుకొని మైత్రేయా! ఈ పుప్పొడి నీ శిరస్సున ధరించు, నీ సమస్త దోషాలూ హరిస్తవి (వేయబోతాడు).

మైత్రేయుడు : (చనువుతో కూడిన పెడసరంతో) నీ శిరస్సుమీద ఉంచుకున్నావుగా! చాల్లే. దోషాలు సమస్తమూ దగ్ధం చేయటానికి భూతేశుడిచ్చిన విభూతి ఉండగా (సంచిలోనుంచి బయటకు తీసి విభూతి మళ్ళీ పెట్టుకుంటూ) నా కెందుకీ ముష్టి పుప్పొడి, కంపుకొడుతూ, పైగా నేనేమన్నా వెనుక దోషాలు చేశానా? ఇంకముందు చేయబోతున్నానా? ఘోటక బ్రహ్మచారిని!

చారుదత్తుడు: (దానిని కూడా తన శిరస్సుమీద ఉంచుకుంటూ) మైత్రేయా! దేవతలమీద కూడా నీకెందుకోయ్ ఇంత ఉక్రోషం.

మైత్రేయుడు : ఊరికే వస్తుందా. గోపురకలశాలకనీ, గోడగడ్డలకనీ, ఈ దొంగదేవుడి గుడిమొఘాన ఇంత డబ్బు తగలేశావు గదా, తిండికి చాలక నానా గడ్డి కరుస్తుంటే నా చేత తిట్లైనా తింటానికి ఒప్పుకున్నాడు గాని ఒక్క చిల్లి గవ్వైనా ఇచ్చాడా. మనకీ దేవుడు?

చారుదత్తుడు : (నేదికమీద కూర్చుంటూ) నీవు ఎంత వెర్రిబాగులవాడివి! మన బ్రతుకే ఆ భగవంతుడి కృపకాదుటోయ్.

మైత్రేయుడు : నా బ్రతుకు కూడానా నా ఖర్మం కాలితే! ఓం శాంతిః శాంతిః -

చారుదత్తుడు : మనం ఆయన ఋణం తీర్చుకోలేని ఈ దరిద్రస్థితికి వచ్చామని నాకెంతో చింత వేస్తున్నది.

————————————————————

116

వావిలాల సోమయాజులు సాహిత్యం-2