(కామదేవునిముందు సకరుణంగా మోకరిల్లి!) ప్రభూ! నాబ్రతుకును ఎన్నాళ్ళు ఈ అడవిలో కాచిన వెన్నెలను చేయదలచుకున్నావు. నా పవిత్ర ప్రేమలతకు ప్రపంచములో ఆలంబనమే లేదా? అనుగ్రహించి నీవిచ్చిన ఈ అందచందాలు ఆటపాటలూ అర్ధోన్మత్తులైన ఈ పామరపల్లవుల పాలు చేయవలసిందేనా? రసిక దాంపత్య ప్రణయానికి ఈ దాసి నోచుకోలేదా? ఊహాగానాలతో ఉజ్వలానంద రసపిపాస తీర్చుకోలేను స్వామీ! నా స్వప్నసౌఖ్యాలకు వాస్తవిక స్థితి రాదా? కనికరించి నా కామితమీడేర్చు ప్రభూ! నీ దయ రానిది ఇక నీ పాదదాసి జీవించలేదు నీకు ఆటలుండవు! - పాటలుండవు!! మదనికా!
(నిస్త్రాణతో లేచి వేదికను సమీపిస్తుంది)
మదనిక: (దగ్గరకు వస్తూ) అక్కా!
వసంతసేన : అమ్మాయీ! ఆర్యచారుదత్తులు ఇందాకనే ఆలయానికి బయలుదేరారంటివే?
మదనిక: అవును. అబద్ద మేముంది!
వసంతసేన : మరి ఏరీ?
మదనిక: (ఎవరికోసమో నిరీక్షిస్తున్నట్లు నటించి) మైత్రేయులూ ఆర్యులూ రాచబాటలో ఆలయానికి పయనమౌదా మనుకుంటుంటే విని ఆఘమేఘాల మీద వచ్చి నిన్ను పిలుచుకోవచ్చానక్కా!
వసంతసేన : ఈ పాటికి వారు వచ్చి వెళ్ళిపోయి ఉండరు గదా!
మదనిక : ఇంతలోనేనా? మనం అడ్డదారిని కూడా వస్తిమి.
వసంతసేన : ఇంకా వారు వస్తారంటావా?
మదనిక : వస్తారనే నా నమ్మకం. (వసంతసేన ప్రక్కకు చేరి కూర్చుంటూ) అక్కా! ఈ దినం అప్పుడే ఆటచాలించావు.
వసంతసేన : ఎందుకో నాట్యం చేయాలని ఆసక్తే లేదు. ఇదని చెప్పలేకుండా ఉన్నాను. కాసేపు గజ్జె కట్టానో లేదో ఎంత అలసిపోయినానో చూడు. (వేదనపడుతుంటే మదనిక ఉత్తరీయపు కొంగుతో విసురుతుంటుంది) అమ్మాయీ! ఏమైనా సరే, వారు ఏమనుకుంటున్నా సరే, ఈ దినం ఆర్య చారుదత్తులు వస్తే ఆ సంగతి అడిగివేస్తాను. లేకపోతే మనస్సును కలతపెట్టే కోరికను ఎన్నాళ్ళని దాచిపెట్టేది?
————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2