పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/111

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శకారుడు : హిఁ హిఁ హి - వసంతసేనే! నాకోసమే!! ఇక్కడికే!!! బావ కూడా తోడు ఉన్నప్పుడే! హిఁ హిఁ హిఁ (చిందువేస్తూ వెకిలిగా)

దశ్శరభ! శరభా!! దమ్మక్క పిల్ల!!
నీరంటి పిల్ల! నిమ్మంటి పిల్ల!!
పొన్నంగి కళ్ళు
మున్నంగి వొళ్లు,
పిల్లంటే పిల్లా!
కల్లంటి పిల్ల!!
దశ్శరభ! శరభా!! దమ్మక్క పిల్లా!!
నీరంటి పిల్ల! నిమ్మంటి పిల్ల!!

కుంభీలకుడు : ఏం బావా! నీవిప్పుడే నిలిచేటట్లు లేదు. ఈ నాట్యం అంతా ప్రభువువారు ఎక్కడ నేర్చుకున్నారో!

శకారుడు : అక్కతోపాటు అయ్యవార్లంగారి వద్ద చెప్పుకున్నాం రణభరతం! రావణభరతం!! నేను గొప్ప ఆటగాణ్ణి.

కుంభీలకుడు : ఆటగాడి వేమిటి? గొప్ప పాటగాడివి కూడా.

శకారుడు : (కుంభీలకుడి చేతిలో ఉన్న పానపాత్రవైపు వేలు చూపిస్తూ) ఏది బావా! ఒక గుక్కెడు ఇలాతే- కళ్ళకు కాస్త కళ్లొస్తుంది.

కుంభీలకుడు : (వరుసగా శకారుడి చేతికిచ్చిన చిన్న పాత్రలో ముమ్మారు పానీయం పోస్తాడు)

శకారుడు : (ఆర్చుకుంటూ తాగి) బావా! నేనెవరిని?

కుంభీలకుడు : (ముఖం వైపు తీక్షణంగా చూస్తూ) శ్యాలకమహారాజులుం గారు.

శకారుడు : నీవో!

కుంభీలకుడు : తమ సేవకుణ్ణి

శకారుడు : (ఆధిక్యస్ఫోరకంగా) ఛీ! సేవకాధముడివి!!

కుంభీలకుడు : (గొంతుమార్చి) బావా! అయితే నీకోసం వసంతసేన రాదు కోపం వస్తున్నది.

———————————————————————

వసంతసేన

111