పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/110

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుంభీలకుడు : బావా! నీవు ఇక్కడెక్కడా పుట్టదగ్గ పురుషుడివే కావు, భూలోక బృహస్పతివి.

శకారుడు : హిఁ, హిఁ, హిఁ, హిం... (జ్ఞప్తికి తెచ్చుకున్నట్లు) ప్రొద్దు పోయిందంటే వినకుండా ఆలయంలో అతివలుంటారు రమ్మని ఇంతదూరం నడిపించుకో వచ్చావు. ఏరీ? ఇంతసేపు ఇంతులను చూడకుండా ఈ శ్యాలకమహారాజు ఎలా ఉంటాడనుకున్నావు?

కుంభీలకుడు : తొందరపడితే ఎట్లా?

శకారుడు : కానీ, బావా ఇదుగో మనం చిన్ననాడు చెప్పుకున్న తత్వం ఒకటి పాడుకుంటాను (చిందువేస్తాడు)

గు, గ్గు, గూటి చిలకేది రన్నా!

చిన, చిన్న గూడుచినబోయె రన్నా! (చిందు వేస్తాడు)

(క్షణంలో స్ఫురించినట్లు) బావా! వసంతసేన !!

కుంభీలకుడు : ఆమె ఇంకా ఇంటిదగ్గర బయలుదేరే వేళే అయి ఉండదు.

శకారుడు : దీపాలు పెట్టిన తరువాత ఇంకేం వస్తుంది?

కుంభీలకుడు : నేను ఆమెను రమ్మని చెప్పిందే అప్పుడు.

శకారుడు : అయితే మన మంత్రం పారిందన్నమాట! పిట్ట పట్టుకు చిక్కిందన్నమాట!!

కుంభీలకుడు : చిక్కటమేమిటి! కాసేపట్లో ప్రభువుగారి చేతుల్లో చిమిడిపోబోతుంటే.

శకారుడు : (పెద్దపెట్టున) హిఁ, హిఁ, హిఁ బావా! (మెడలో హారం తీసి అతనికి ఇవ్వబోయి మళ్ళీ మెళ్ళో వేసుకొంటూ) నా కోసం వసంతసేన వస్తుందా?

కుంభీలకుడు : ఆఁ

శకారుడు : తప్పకుండా?

కుంభీలకుడు : తప్పకుండా!

శకారుడు : నా మీద ఒట్టే? (చెయ్యి జాపుతాడు)

కుంభీలకుడు : (చేతిలో చేయి వేస్తూ) నీ మీద ఒట్టే.

——————————————————————————————

110

వావిలాల సోమయాజులు సాహిత్యం-2