ప్రవేశిక
క్రీ. శ. 12వ శతాబ్ది మధ్యభాగం. హైహయ వంశస్థుడైన అలుగురాజు పలనాటి రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. చందవోలు రాజధానిగా ఆంధ్రదేశాన్ని ఏలుతూ ఉన్న వెలనాటి చోళరాజు పుత్రిక, మైలమ మహాదేవి, అతని దేవేరి. పలనాటి రాజ్యాన్ని తండ్రి ఆమెకు అరణంగా ఇచ్చాడు. భర్త దానికి పాలకుడైనాడు. విజ్జలదేవీ, భూరమాదేవీ అలుగురాజుకు ఇతర భార్యలు.
ముగ్గురిని వివాహమాడినా అలుగు రాజుకు చాలాకాలం సంతానం కలుగలేదు. మంత్రి దొడ్డయ జ్యేష్ఠ పుత్రుడు, బాదన్నను పెంచుకున్నాడు. దైవ వైపరీత్యం వల్ల దత్తస్వీకారానంతరం రాజుకు ముగ్గురు భార్యల వల్లా సంతానం కలిగింది. మైలమ దేవికి నలగామరాజూ, భూరమాదేవికి నరసింగరాజు, విజ్జలదేవికి మలిదేవాదులూ జన్మించారు.
నలగామరాజు బాల్యంలో అలుగురాజు రాజ్యాన్ని రెండుగా విభజించి ఒకభాగం పెంచుకున్న బాదన్నకూ, మరో భాగం నలగామరాజుకూ చెందేటట్లు చూడవలసిందని ఆనాడు మంత్రిత్వం నెరుపుతూ ఉన్న దొడ్డయ మంత్రి ద్వితీయ పుత్రుడు బ్రహ్మనాయునితో చెప్పి స్వర్గస్థుడైనాడు. తరువాత కొలది కాలానికే తన రాజ్యభాగాన్ని మలిదేవాదుల కిచ్చి బాదన్న మరణించాడు.
అలుగురాజు కుమాళ్ళనందరినీ సమానాదరంతో సాకుతూ బ్రహ్మనాయుడు కొంతకాలం రాజ్యచక్రం త్రిప్పి 'పలనాటి కిష్టయ్య' అనే ప్రఖ్యాతి గడించాడు. ఇంతలో నలగాముడికి యౌవనోదయమైంది. ఒకనాడు వేటకు పోయి ఎత్తిపోతల అడవుల్లో నాగమ్మ (నాయకురాలు)ను చూచి రాజధానికి ఆహ్వానించాడు.
నాగమ్మ ఒక రెడ్డి రైతు కుమార్తె. బ్రహ్మనాయుడు, నలగామరాజూ, పూర్వమే నాగమ్మ తండ్రిని ఏదో రాజనేరం కారణంగా ఉరికంబాని కెక్కించారు. ప్రతీకార వాంఛతో ఆమె రాజు ఆహ్వానాన్ని అంగీకరించి రాజధాని చేరింది. క్రమక్రమంగా ప్రాపకం అభివృద్ధి చేసుకొని మహామంత్రిణిగా మారిపోయింది. అన్నదమ్ముల్లో
నాయకురాలు
11