ఒకటో దృశ్యం
(ఉజ్జయినీ నగరం, సమయం దీపాలవేళ. కామదేవాలయ ప్రాంగణంలో కుడివైపు చిన్న వేదికమీద మదనదేవ విగ్రహం. ఎడమవైపు ఒక వేదిక అలికి ముగ్గులు పెట్టి ఉంటుంది. ప్రవేశము రాజశ్యాలకుడు శకారుడు, అతని మిత్రుడు ఒక విటుడు, కుంభీలకుడు)
శకారుడు : (రాజసంతో నాలుగు దిక్కులూ పరికిస్తూ) బావా! ఇటువంటి బ్రహ్మాండమైన ఆలయాన్ని మనవాళ్లు ఎందుకు కట్టించారో ఎన్నడైనా ఆలోచించావా?
కుంభీలకుడు : (చమత్కారంగా) మహాప్రభువులు, తమబోటివారి కొలువులో పడ్డ తరువాత తీరుబడి ఎక్కడేడ్చింది?
శకారుడు : అయితే నాకొక మంచి ఊహ తోచింది.
కుంభీలకుడు : (వెటకారంగా) ఓహోఁ (ఏదీ అన్నట్లు చిటిక వేస్తాడు)
శకారకుడు : (స్వాతిశయంతో నిలిచి బావా! నేను మహాపండితుణ్ణి, రామాయణ, భారత, భాగవతాలూ, ఇంకా అనేక గ్రంథాలు ఉప్మని ఊదేశాను. నాలుగు వేదాలల్లో నాకు తెలియని సంగతులు వేరే ఏమున్నవోయ్. ఆలోచించకుండా ఈ మంచి మనస్సు అరనిమిషం ఊరుకోదు.
కుంభీలకుడు : ఇంతకూ ఇటువంటి దేవాలయాలు....
శకారుడు : ఆఁ, పూర్వులు ఇవి కట్టించటంలో పరమ రహస్యం ఒక్కటే. ఊళ్ళో మగవాళ్ళనూ, ఆడవాళ్ళనూ ఉదయం సాయంకాలం ఒక్కచోట చేర్చటానికి.
కుంభీలకుడు : చేరిస్తే -
శకారుడు : ఇంతేనా మరి? పెళ్ళిళ్ళు కానివాళ్ళకు పెళ్ళిసంబంధాలూ, అవీ లేనివాళ్ళకు ప్రేమ సంబంధాలూ కష్టం లేకుండా కుదిరిపోతవని.
వసంతసేన
109