పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/820

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కరకంకణముల మెరుస్తు
హస్తానికి నాగవత్తి
రమ్యమైన మణిమేఖల[1]
అందెలు, కడియాలు, జిలుగు
గజ్జలతో దిద్దుకొనిరి
యవ్వనాని కుచితమైన
వర్ణాలతో నొప్పునట్టి
స్తనవల్కల వసనమ్ముల
కడు రమణీయముగ దాల్చి
హారిద్రాకుంకుమలను
గంధపుష్పమాల్యమ్ముల
చెలిమి మెరయ స్వీకరించి
శరద్రాత్రి, పౌర్ణమినా
డందరకును పరమేశ్వర
పత్ని నన్న భావమ్మును
తెలియజేస్తు, నన్ను కనుడు
నన్ను వినుడు, అనుపాద
మ్మును చెప్పుచు అందరకును
మేళతాళగమనముతో
జ్యోతుల విక్రాంతితోడి
శిష్యురాలు పూజావ
స్తువులతోటి వెంటరాగ
నగరీజను లెల్ల జేరు
శ్రీ కృష్ణుని ఆలయాని
కరిగి మీరు ఆరంభము
నకు యోగ్యమ్మైన మరో
భావ మేర్పడియుంటను
మీ శిష్యకు దేవదాసి
దీక్షా క్రమబోధనమ్ము
'నన్ను కనుము, నన్ను వినుము’
ఆదేశము జ్ఞప్తిచేసి
ప్రారంభము చేసినారు.
కొంతకాల మిలా వస్తు-
శిష్యురాలివిద్య పరా
కాష్ఠ నందుకొనెడి వరకు -
నవవిధ శృంగారమ్ముల
నభినయింప నేర్చువరకు
ఉదయసమయ ధర్మములకు
సౌందర్యసమయ ధర్మములకు
వసంతాదులౌ ఋతువుల
ధర్మములకు వెన్నెలపూ
తల జల్లుల ధర్మమ్ముల
కనుగుణమౌ నర్తనములు
నభినయింప నేర్చువరకు
కౌతూహల హేలాలీలా[2]
విలాస విభ్రమ బి
బ్బోకాదుల[3] రోమాంచిత
విన్యసనల[4] జనియింపగ
జేసి, చూప నేర్చువరకు
నాట్య గాన విశేషాల
ప్రణయభావ నుద్దేష్టాల[5]
పంచియిచ్చి సభను ఉన్న
సర్వజనుల - స్త్రీ పురుషుల
నందరినీ కొంత వరకు
తనవలెనే స్త్రీలజేస్తు
రజోభావ రాధికలుగ
కృష్ణ భుజంగికల[6] వోలె
భిన్న భిన్న గోపికలుగ

________________________________________________________________________________

820

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1

  1. మణిమేఖల = మణులతో కూడిన వడ్డాణము
  2. హేలా = భూనేత్ర వికారాదులచేత చక్కగా తెలియదగు మనోవికారము లీలా = క్రీడ, శృంగార చేష్ట
  3. బిబ్బోకాదులు = గర్వాతిశయముచే నాయికకు ఇష్టవస్తువు నందైనను కలుగు అనాదరము
  4. విన్యసనలు = అవయవములు నాట్యశాస్త్ర క్రమమున ఉంచుట
  5. నుద్దేష్టాల = బాగుగా కోరబడెడు ప్రియ
  6. కృష్ణభుజంగికలు = నల్లనాగులు