పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/808

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



సాష్టాంగ ప్రణామమ్ము
లర్పింపగ జేసినారు
మీ గొప్పను నాకు చెపుతు
ఇంటికి గొనివచ్చినారు
మీరు చేయు 'శంభో!' అను
ఆలాపన 'గోవిందా!'
అను స్మరణము అనుకరిస్తు
బహుకాలము గడిపినాను.

—♦♦♦♦§§♦♦♦♦—

18   ధ్యానము గావించి మిమ్ము
ఆవాహన చేసినంత
ఆదరణతో ఈనాడును
అరుదెంతువు ఆదిభట్ట!
అభినుతించి అంజలించి
ఏ నివాళు లర్పించిన
ఏది అడిగిన నది చెప్పెదు.
ఎవ్వరి కడ నేమియు పఠి
యింపకున్న నేమి భట్ట
అఖిలవిద్యలును నీవై
అలరింపగ జేసెగదా!
నృత్య సరస్వతివి నీవు,
గాన సరస్వతివి నీవు,
సాహిత్య సరస్వతివి,
సర్వకళా శారదవు
సత్యభావ నీరదవు[1]!!
నీవు నిల్చు నిలయమ్ములు!!
నిస్తుల దేవాలయాలు
వేదమంత్ర మూలాలౌ
దేవతలను పిలిచి నీవు
వీక్షింపగ జేసెదవు.

—♦♦♦♦§§♦♦♦♦—

19   ఓ నారాయణదాసా!
ఓహో ఓ మహాదాస!!
నీవు తెలుపు భావమ్ములు
నిత్యమ్ములు, సత్యమ్ములు
నిర్మలములు, నిస్తులములు[2]
ఆముష్మిక బోధనములు!
అఖిల [3]పాపభంజకములు!!
భక్త్యాషధ గేహమ్ములు
వలచి వచ్చి చేరును నిను
ప్రీతితోడ, ప్రేమతోడ
మంగళ సద్ద్రవ్యమ్ముల
రమ్య పరమభాజనాల[4]
పంచియిచ్చి సమ్మోహన
[5]రసచషకము నందింతువు
కథాకథన జలధియాన!
భక్తరక్షణాభిమాన!!
కడునేర్పరి! [6]కర్ణధారి!!

—♦♦♦♦§§♦♦♦♦—

20   నారాయణభట్ట! మీరు
నారాయణులే తలంప
అవతరించు వేళను నా
రాయణుండు నరసంబం
ధము గల్గిన దేహమ్మును
దాల్చుగదా! అట్లె సర
స్వతులు మీరు ఆదిభట్ట
నారాయణగాను అవత
రించినపుడు నరశరీర
మును ధరించినారుగదా!

—♦♦♦♦§§♦♦♦♦—

  1. నీరదవు = మేఘమువు
  2. నిస్తులము = పరుషమైనది
  3. భంజకములు = విరుచునది
  4. భాజనాల = భోజనపాత్రలు
  5. చషకము = పానపాత్ర
  6. కర్ణధారి = ఓడను నడుపువాడు

________________________________________________________________________________

808

వావిలాల సోమయాజులు సాహిత్యం-1