పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/76

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స. పగలే సూర్యుడు ఘూకమై యడఁగె విశ్వం బద్భుతం బందఁగన్

పూ.మ. "పగయౌ మేరువుఁ గెల్వ వింధ్యనగ మప్పాటన్ విజృంభించి తా
         ఖగతారా పదముల్ గమించి నిలువన్ కాలజ్ఞతా శూన్యమౌ
         నిగణంబుల్ తను వేడ కుంభజుఁడు సందీపించి వాక్రుచ్చె
         పగలే - సూర్యుఁడు ఘూకమై యడఁగె విశ్వం బద్భుతం బందఁగన్.

స. ఒక రూపంబు ధరించి కొల్చు హరియా బాలేందు చూడామణిన్.

పూ.మ. "సకలాదిత్యులు దేవతాన్నమును విశ్వాసంబునన్ ద్రావునం
         తకు దైతేయుల మోహినీ నటన మధ్యాసించి నిల్పంగ వం
         చకుఁడై లీలఁ జరించు వేళ సుతు నొందం జేరినన్ పంక జాం
         బక రూపంబుధరించి కొల్చె హరియా బాలేందు చూడామణిన్.

స. ఒక రూపంబు ధరించి కొల్చె హరియా బాలేందు చూడామణిన్.

పూ.మ. ప్రకటక్రీడగ సూర్యచంద్రులను చక్రద్వంద్వముంజేసి, యు
        త్సుకతన్ భూరథమెక్కి, యజ్ఞజుని నుద్యోగించి, సారథ్య పా
        లకుగా, ఆ త్రిపురాసుర ప్రతతి గెల్వంబోవు నవ్వేళ నం
        దొక రూపంబు ధరించి కొల్చె హరియా బాలేందు చూడామణిన్."

స. పక్కున నవ్వె గౌరి తలంబ్రాలను బోయుచు రాజమౌళిపై.

పూ.ఉ. “ఎక్కితినే శిరమ్ము, నటియింపగ నేర్తు - తపించి యేటికే
        చక్కని చుక్క వచ్చి" తని జాహ్నవి మేలఁపు జూపు జూడ “ఓ
        అక్కరో! నాదె ఈశు - హృదయంబని యక్కున నిల్పి వీక్షలన్
        పక్కున - నవ్వె గౌరి తలంబ్రాలను బోయుచు రాజమౌళిపై

స. పక్కున నవ్వె గౌరి తలంబ్రాలను బోయుచు రాజమౌళిపై

పూ.ఉ. మిక్కిలి మక్కువన్ పతిని మించి శిరమ్మున నుంచు కోర్కెమై
       నిక్కుచు పెక్కుమారులుగ నేర్పునఁ బోసి యొకింత వెన్కకున్
       జిక్కగణంబు లాయలపుఁ జేతల గేలిగ నాడి చూపు చో
       పక్కున నవ్వె గౌరి తలంబ్రాలను బోయుచు రాజమౌళిపై.


76

వావిలాల సోమయాజులు సాహిత్యం-1