పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అని నను ప్రోత్సహించెడు నయాచిత శక్తి యొకండు ఎన్నడున్
గన నిటు దీనతాగుణము నాపయినన్ విజయమ్ముగొంట నే
ననుకొని తీర్పనట్టిది మహత్తరకృత్య మొకఁడు లేదు నా
మన మురియాడ నేల? ననుమానములన్ కలగుండు నొందుచున్.


ఉ.

"తుంటరి వింటితో కదనదోహలియైన పినాకపాణి పై
కొంటిగ నేగుచుంటివి సముత్సుకతన్, గళమెత్తి నందినీ
బంటుదనమ్ము చూడ నొకపాటిగ రంకె యొనర్ప డిల్లవో
కుంట పొసంగునే? అళులనో మదనా! మది నమ్మ జెల్లునే?"


చ.

అని మొరవెట్టి పల్కునెడ నో రతి! దీనత దుఃఖరేఖ నా
మనమున హత్తుకొంటివి - సమాయతవై పలుమారు తోచె దే
ననుకొన స్వప్నమందయిన నబ్బెడు నీ దురవస్థయంచు - ఓ
వనజముఖీ! త్వదీయముఖవారిజశోభ లెసంగుగావుతన్.


చ.

పొలయలుకన్, నిరాదరణపూర్వక చేష్టల, మందహాసరే
ఖల నెటుగా ప్రయత్నవిముఖత్వము గూర్పగ పాటుబడ్డ నే
చలనము నొందకుంట, పటుసాహసవైఖరి నుత్సహించుటన్
కలగుచు నన్ను నంపునెడ గాఢభయాన్విత వైతి వో సతీ!


చ.

కనకపుకంబ మొండు స్ఫటికంపు సురమ్యవిశాలహర్మ్యమం
దున లగియించి నట్టులుగ తోచెడి శర్వుడు యోగశక్తిచే
ననుచగ నాత్మతేజము మహోన్నతదేహమునందు మున్ను నే
ననుకొన నీశు డర్యమ సహస్ర కళాకలితుం డటం చెదన్.


ఉ.

ఎంత మహోగ్ర మీ తపమ రెట్టి మహార్ధము నొంద గోరియో!
అంత మదెన్నడో యెరుగ మాత్మభవా! శివ! అష్టసిద్ధు ల
త్యంతము నిన్నె చేరెను గదా? యిది ఏటికయా మహేశ! ర
వ్వంత విలాసమా, నిజనిరామయధారణకున్ పరీక్షయా?

18


ఉ.

కమ్మని తావి గాలిబుడతల్ తలకెత్తుచు మోయలేని భా
రమ్మున మందమంద మధురమ్ముగ సాగుచు వచ్చి వచ్చి నీ
డమ్ముల నిద్రనోవ ప్రకటస్ఫుట పంచమగీతి సృష్టి మ
ర్మమ్ముల వ్యాఖ్యసేయ నమరన్ పిలచున్ పిక జంపతీతతిన్.


______________________________________________________________________________________

42

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1