పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/26

ఈ పుట ఆమోదించబడ్డది

సమీక్షణం

నేను మెడపైకెత్తి చూచేటంత ఎత్తైన వ్యక్తిత్వం గల మనీషి శ్రీ వావిలాల సోమయాజులుగారు. ఆయన సుహృదయ స్పందన నుండి, ప్రౌఢధిషణ నుండి ఆవిర్భవించిన ఈ పద్యకావ్యానికి నేను నాలుగు మాటలు సమీక్షారూపంలో రాయటం కేవలం విద్యావయో వృద్ధులైన మా ఊట్ల కొండయ్యగారి మెత్తని ఆజ్ఞవల్లనే:

ఈ కావ్యాన్ని "శివాలోకనము” అనటంలోనే కావలసినంత కవిత్వం వుంది. కావ్య ప్రయోజనాన్ని వివరిస్తూ మమ్మటుడు


"కావ్యం యశసే౽ర్థకృతే వ్యవహార విదే
శివేతరక్షతయే సద్యః పర నిర్వృతయే
కాంతా సమ్మిత తయోపదేశయుజే”


అని వక్కాణించాడు. ఈ నిర్వచనంలోని శివేతరక్షతే యీ కావ్యానికి శివాలోకన మయ్యింది. అంటే అమంగళ పరిహారార్థమన్న మహత్తర కావ్యప్రయోజనం కాస్తా "మంగళ ప్రదమైన చూపు" అయ్యింది.

ఈ రకమైన అంటే “విశ్వశ్రేయః కావ్యమ్" అనే లక్ష్యంతో కూడిన శివాలోకనం గల కవే జగత్కల్యాణాన్ని సాధించగలడు. అయితే అటువంటి 'చూపు' కలగాలంటే చిత్తసంస్కారం చాలా అవసరం. కవుల స్థానం ఈ చిత్తసంస్కారాన్ని కలిగించటంలోనే నిర్ణయించబడుతుందనే సత్యాన్ని Emerson అనే పండితుడు, "Great Poets are judged by the frame of mind they induce in us" అంటూ చెప్తాడు. ఈ కావ్యాన్ని చదివి ఆలోచనామృతాన్ని ఆస్వాదించిన తర్వాత, సోమయాజులు గారి మహాకవి అనని సాహిత్యాభిమానులుండరని నా విశ్వాసం.

మానవుని దుష్టప్రవృత్తిని క్షాళనం చేసి, ఉత్తమ సంస్కార బీజాల్ని అతని హృదయ క్షేత్రంలో నాటగల మహత్తర కావ్యాలు భారత, భాగవత రామాయణాలు. ఈ కావ్యంలోని “ఆత్మార్పణము”, “బృహన్నలాశ్వాసము” అనే ఖండికలు భారతానికి, 'వాత్సల్యప్రియ”

అనే ఖండిక భాగవతానికి, “పరివర్తన" అనే ఖండిక రామాయణానికి అనుబంధాలు

26

వావిలాల సోమయాజులు సాహిత్యం-1