పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/24

ఈ పుట ఆమోదించబడ్డది


“ఇంచు కాడంబరుడు గర్వి ఏమొ గాని
జలద యువకుడు వాడు ప్రశస్త గుణుడు
భావుకత వెఱ్ఱియై నింగి పర్వులెత్తు
మనవలెనె వాడు పాడక మనగలేడు.”


నాకు పలువురు సహృదయులు విద్వత్ కవులు సన్మాన పత్రాలు ఎన్నెన్నో అందించారుగాని - అన్నిటిలో శ్రీసోమయాజులుగారి సుహృల్లేఖ - మకుటాయమాన మైన సన్మాన పత్రముగా భావించి నేను భద్రం చేసుకున్నాను.

సంస్కృత సాహిత్యాన్ని మాత్రమేగాక శ్రీసోమయాజులుగారు ఆంగ్లవాఙ్మయాన్ని గూడ ఆపోశనం పట్టారు. షేక్స్‌పియరు నాటకాలను వారు తెలుగులోకి అనువదించిన తీరు తీయాలు, తరతరాలవారికి ఒరవడులుగా నిలుస్తాయి.

ఆంధ్రుల సాహితీ సంప్రదాయంలో - భువన విజయం - అష్టదిగ్గజకవి వ్యవస్థ విశిష్ట స్థానాన్ని పుంజుకున్నాయి. ఆధునిక కాలంలో అష్ట దిగ్గజాలను ఎన్నుకోవలసి వస్తే - శ్రీసోమయాజులుగారికి ఏకగ్రీవంగా లభించేది "ధూర్జటి” పాత్ర. వీరు వ్రాసిన “విన్నపం” ఆధునికాంధ్ర వాఙ్మయంలో విశిష్టమైన రచన. అష్టదిగ్గజాలలో ధూర్జటి విశిష్ట వ్యక్తిత్వం గల మహాకవి. ఆంధ్ర వాఙ్మయములో మాత్రమే గాక, ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం విశ్వసాహితీ రచనలోనే సాటిలేని ఉజ్జ్వల రచన. ఆంధ్ర సాహితీ పట్టభద్రుడు కాగోరేవారు ధూర్జటి వ్రాసిన ప్రతి పద్యం తప్పనిసరిగా చదవాలి. అథవా - శ్రీసోమయాజులుగారు వ్రాసిన “విన్నపం” పూర్తిగా కంఠస్థం చేయాలి - అని నా అభిప్రాయం. ఈ ఖండిక 1952 నవంబరు భారతిలో ప్రచురింపబడింది.

ఈ పద్యాలు శ్రీసోమయాజులుగారు తాడేపల్లిగూడెంలో కవి సమ్మేళనంలో చదివినపుడు నరసాపురం వాస్తవ్యులు డాక్టరు పొన్నపల్లి సుబ్రహ్మణ్యం గారు ఆనందబాష్ప విలులిత నేత్రాలతో విని సద్యఃపరనిర్వృతిలో లీనమైపోయారు. తదుపరి శ్రీసోమయాజులుగారికి సత్కారం చేయటానికి నరసాపురంలో డాక్టరుగారి అధ్యక్షతన ఒక సన్మానసంఘం ఏర్పడింది. దానికి నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అధ్యక్షుని అకాలమరణంతో ఆ సన్మానం జరుగలేదు. ఆ బాకీ తీర్చవలసిన బాధ్యత నాపై ఇంకా మిగిలి ఉంది. ఇంకా ఈ గ్రంథం ప్రచురణ - ఈ గ్రంథం ఆవిష్కరణ

మహోత్సవంలో పాల్గొని, నా సౌహృదఋణం తీర్చుకోవాలని నా తహ తహ!

24

వావిలాల సోమయాజులు సాహిత్యం-1