పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

గుణగ్రహణపారీణుడైన శ్రీవేంకటరత్నం గారికి, శ్రీవావిలాల సోమయాజులు గారిపై ప్రత్యేకమైన “మోజు” ఉండేది. నవ్య సాహిత్యపరిషత్తు ఆయన దత్తపుత్రిక. ఆయన అతిథి సేవాపరాయణత్వంలో అభినవ పెరియాళ్వారు. ఆయన ఇంటిలో శనివారము నందు మాత్రమే గాక, నిత్యం అతిథిపూజ అర్ధరాత్రి వరకూ జరిగేది. శ్రీఅడివి బాపిరాజు, శ్రీవేదుల సత్యనారాయణ శాస్త్రి, శ్రీదేవులపల్లి కృష్ణశాస్త్రి, ప్రభృతులు తమ నూతనకవితలు వినిపించేవారు. తెరమరుగున నిలిచి నవ్య సాహిత్యానికి చిరస్మరణీయమైన సేవ చేసినవారిలో ప్రాతఃస్మరణీయుడు శ్రీతెలికిచెర్ల వేంకటరత్నం గారు. ఆయన “ప్రతిభ" పత్రికకు సంపాదకుడు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఆంధ్రశాఖకు అధిపతి. ప్రతిభను గుర్తించటంలో ఆయన కన్నులు దృగ్భిణీ యంత్రాలు. ఆనాడు అనామకులుగా నిరుద్యోగులుగా అలమటించే యువ నవ కవులను చేరదీసి కేవలం పరోపకార పారీణతలో ఆంధ్ర క్రయిస్తవ కళాశాలలో ఉద్యోగాలు ఇచ్చి, ప్రతిభ పత్రికలో వారి రచనలు ప్రచురించి ఆదరించిన మహనీయుడు ఆయన. శ్రీపాపయ్యశాస్త్రికి, నాకు మొట్టమొదట ఉద్యోగాలు ఇచ్చింది ఆయనే. ఆ నాడు పలువురు యువకవుల నవనవోన్మేష ప్రజ్ఞకు ఆటపందిరి 'ప్రతిభ' పత్రిక.

“సభాపతి” శ్రీశివశంకర శాస్త్రిగారు ఆ నాడు 'నవీన బహుళాంధ్రోక్తిమయ ప్రపంచానికి' సాహిత్యాచార్యుడు. శిష్యవత్సలుడైన ఆయనకు - భారతంలో ద్రోణాచార్యులకు అర్జునునిపై ఉన్నట్లు - శ్రీసోమయాజులు గారిపై పక్షపాతప్రాయమైన ప్రత్యేకప్రేమ ఉండేది. నేను ఆ తల్లావజ్ఝల వారికి ఏకలవ్య శిష్యుడను. సుదూరంగా నిలిచి ఆయనను ఆరాధించేవాడిని. నవ్య సాహితీ మహోద్యానవనంలో విచ్చకముందే “మొగ్గల”లోని సౌందర్య సౌరభాలను రంగరించి ప్రపంచానికి ప్రసారం చేసిన సహృదయామోద గంధవహుడు ఆ మహానుభావుడు. శ్రీవావిలాల సోమయాజులుగారు శ్రీశివశంకర శాస్త్రిగారికి అభిమానపాత్రుడైన "గద్య పద్య కావ్య నిర్మాణ చాతురీ సవ్యసాచి". గద్య రచయితలు పద్య రచయితలు కాకపోవచ్చు. అట్లే పద్య రచయితలు గద్య రచయితలు కాలేకపోవచ్చు. శ్రీ సోమయాజులుగారి అసలు ప్రజ్ఞ పద్యరచన.

"ఏక శ్లోకః ప్రబంధ శతాయతే” అన్న ప్రశస్తి సంస్కృతంలో అమరుకునకు అన్వయిస్తారుగాని - వంద ప్రబంధాలతో సరితూగగల ఒక పద్యం వ్రాయగల నేర్పు తెలుగులో శ్రీవావిలాల సోమయాజులు గారిది. కవిత వాగర్థాల వర్ణనాతీత సమ్మేళనం. భాష భావాల కలయికలో పార్వతీ పరమేశ్వరుల పవిత్ర దాంపత్యం పరిఢవిల్లాలి!


22

వావిలాల సోమయాజులు సాహిత్యం-1