తే. వీరులును బలిష్ఠులు నైనవారు, నస్త్ర,
పండితులును దుష్కాలమ్ము ప్రాప్తమైన
వాలుకాసేతువుల వలె వారు యుద్ధ
మందు నశియించి పోదు రో యసుర వర్య!169
తే. ఆపదెదియైన వచ్చిన నాప్తులైన
స్నేహితులకు వారికిఁ జెప్పవలయు
బుద్ధిమంతుఁడు శాశ్వత పుణ్యయుతము
నైన హితమును వారి శుభార్థమునకు.170
తే. కుటిల లక్షణు లెదలోనఁ గూడియున్న
భావములు వెలిబుచ్చక వ్యవహరింత్రు
ఏమరిన వేళ వారు గావింత్రు ద్రోహ
మది పరమమౌ ప్రమాదము నాచరింత్రు.171
తే. ఎట్టి కార్యమేనియును యోజించి మంచి
చెడుల నాచరింపఁగవలె 'చెడుది' అనుచుఁ
దోచినను దానిఁ గావింపఁ దోడు పడక
చిత్తమిడక దానిని విసర్జింపవలయు.172
తే. ఏదో యొక కార్యమందు వర్తింపఁజేయు
వరకు నెవ్వని శక్తియవ్యక్తపడదు
కాని వేగిరపడుచు నేకార్యమందు
వ్యక్తి నెఱుఁగక యోగించు టనుచితమ్ము.173
తే. "ఇది సరియైన కాలమా? ఇద్ది అట్టి
దేశమా? కాదు” అన్నట్టి తీవ్ర నిర్ణ
యమ్ము మనుజుని కడ నిల్చు ననవరతము
మంచి చెడులిట్టులే నిల్చు మనుజుని కడ.174
తే. కష్టపడకయె పొందిన గాఢమిత్రు
మనము సందేహపడిన నా మాన్యమిత్రుఁ
డరుగుఁ! దొలఁగి - అర్థరహితమైన ప్రశ్న
అట్లు పోఁగొట్టు మంచి స్నేహితుని - నిజము!175
మధుప్రప
215