పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/214

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే. గోవులందున సంపద, క్రుద్ధులయిన
    జ్ఞానుల వలన భీతియు, కాంతలందు
    చపలతయు బ్రాహ్మణులలోన చతురతపము
    భావ్యములు నమ్ము మిద్దాని పరమసూక్తి. 162

తే. జలజ పత్రాలపైఁ బడ్డ జలపు బిందు
    వులు కలియనటులాకుతో, గలిసియుండ
    వెపుడనార్యమనస్సులు ఇచ్చతోడ
    గాఢసాంగత్యములతోఁ బ్రగాఢముగను163

తే. ఆ శరత్కాల మేఘంబు లధికగర్జ
    లొనరఁ గావించుచును వర్ష మొనరఁ గురిసి
    నఁ దడియదు నేల? ఆ విధాన చెడువారి
    యందు సాంగత్య మెపుడుఁ బ్రత్యక్షమగును.164

తే. మధుకరము దప్పిఁగొన్నదై మధువుఁ ద్రాగు
    కాని యెన్నఁడు పూవుపైఁ గడగి నిలదు
    సజ్జనులు గాని దుష్టుల సౌహృదమ్ము
    ప్రీతి యుండదు పూవుపై వెలయు నిటులౌ.165

తే. స్నాన మొనరించు తొలుత ప్రశాంతి గజము
    చిమ్ముకొను తుండమున ధూళి ముమ్మరముగ
    పైకి పిదప - శరీరము పరచు మైల
    మనకనార్య స్నేహ మీ మాడ్కిఁదోచు.166

తే. దుష్టకాలమ్మునకు లొంగి దోషబుద్ధి
    వర్తన మొనర్చు దుష్టులు వారి హితము
    కోరి యోజించి చెప్పిన వారి వాక్య
    ములను గ్రహియింప రణు మాత్రమును హితమ్ము.167

తే. ఏ పరిస్థితి యందైన నెవియొ యిష్ట
    మయిన మాటలు చెప్పెడునట్టి వారు
    సుగములు జగాన అప్రియము శుభ్ర మొక్క
    టయిన మాటను బల్కువా రసలె లేరు.168


214

వావిలాల సోమయాజులు సాహిత్యం-1