పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

నిర్దేశింపబడినాయి. సోమయాజులుగారి వివరణ, వ్యాఖ్యానం, తాత్పర్యంతో కూడిన 'నోట్సు' చదవని కళాశాల విద్యార్థి లేడంటే అతిశయోక్తి కాదు.

వావిలాల వారిది వెన్నలాంటి మనస్సు. వెన్నెల లాంటి చిరునవ్వు. వేణువు లాంటి గాత్రం. వేదం లాంటి విజ్ఞానం. వేలుపు లాంటి రూపం. జీవితంలోని అందాన్ని, ఆనందాన్ని పదిలంగా ఆస్వాదించి, తోటివారికి పంచిపెట్టగల చరితార్థుడు రసవేది, రసవాది వావిలాల.

సోమయాజులు గారి శేముషీవిశేషం అంతా ఏండ్ల తరబడి విద్యార్థులకు 'గైడ్లు' వెలయించటంతోనే చెల్లింపబడిందనీ, రావలసినన్ని కావ్యాలు వారి చేతి మీదుగా రాలేదనీ తపనపడేవారిలో నేను మొదటివాణ్ణి. ఇప్పుడు ఈ విధంగా వారి రచనలు వెలువడటం అస్మదాదులందరికీ అపరిమితానందాన్ని కలిగిస్తున్నది.

కవిత్వం, పాండిత్యం, పరిశోధనం, ఆచార్యత్వం, వక్తృత్వం, మిత్రత్వం ఏకీకృతమైన రూపం ఆయనది. ఇతోధికమైన గ్రంథాలు ఆయన నుండి వెంట వెంటనే వెలికి రావాలని కోరుతూ నా “ముందు మాట" ముగిస్తున్నాను.

- డాక్టర్ కరుణశ్రీ


20

వావిలాల సోమయాజులు సాహిత్యం-1