పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది


"ఏనాడైన భువిన్ అసూయ కలుషం బీర్ష్యావ్యథాశాంతియే
కానన్ రావు సమత్వ మభ్యుదయ మగ్రామ్యంబు సౌఖ్యంబు”

"శిరమున నున్న గంగ శశిశేఖర: నా రసనాంచలమ్ము నన్
దిరముగ నిల్పుమయ్య”

“నా కొక జన్మమున్న భువి నన్ జనియింపగనిమ్ము స్వామి : నీ
వాకిట బిల్వవృక్ష మటు వత్సలతన్”

"భోగము లారగించు తలపుల్ కొని చంచల చంచరీక హృ
ద్వేగ గతిన్ చరించి భ్రమ తీరగ జేరితి నిన్ శివా!”


మొదలైన పద్య పంక్తులలోని హృద్యానవద్యములైన భావాలు గమనింపదగినవి.

సందర్భ సముచిత సమాసవిన్యాసం వావిలాల వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ సురుచిర సమాససంఘటనం చూడండి -

ప్రౌఢానంత వాసంత లీలాలాలిత్యము, అనంత విలాస శకుంత సంతతులు, మహోన్నత భక్తి రసప్రపూత, చండీశోద్ధత కార్ముకోపమ మహాచాపమ్ము త్వదీయ ధనురంచిత జంభర మంజు శింజినీ రసభర ఝాంకృతీ ధ్వని, ఐంద్రద్వీపోద్గళ ఘంటారవ పాటవోజ్జ్వల లసత్కావ్యంబు మొదలైనవి అనాయాససమాస లాస్యవిలాసాన్ని వ్యక్తం చేస్తాయి.

కాటికి కాళ్లు చాచుకొను, గంపెడు కోర్కెలు, మిన్నుల తన్ని పోరగల మేటి బలాఢ్యుడు, ఉప్పెన నవ్వు, కదనదోహలి, దురుద్యోగి, కనుచూపు వెన్నెలల తీరము, తడబడు గుండె, గాలి బుడతలు, ఎడద ఉయ్యాల వంటి జాతీయాలూ, శబ్దసంపుటులూ - వావిలాల వారి ప్రత్యేక ప్రతిబింబాలు.

ఈ విధంగా బహుముఖీన గుణగణమండితమైన “శివాలోకనం" సహృదయు లందరికీ సదా సదాలోకనమై, సాహిత్యజగత్తులో వ్యక్తిత్వం ముద్రాభద్రమైన స్థానాన్ని వావిలాల వారికి వాటిల్ల జేస్తుందని నా విశ్వాసం.

సోమయాజులు గారి వ్యాసాలు, కావ్యఖండికలు, నాటకాలు మొదలైన వెన్నో పుంఖానుపుంఖాలుగా సుప్రసిద్ధ సాహిత్య పత్రికలైన భారతి, ప్రతిభ, గృహలక్ష్మి, ఆనందవాణి మొదలైనవాటిలో ప్రచురితమై, పాఠకుల ప్రశంసల్ని అందుకున్నాయి. ఎన్నో గ్రంథాలు పాఠ్య గ్రంథాలుగా విశ్వవిద్యాలయాలలో కళాశాలలలో


శివాలోకనము

19