“ఉజ్జీవం”లో తానే దేవతలకు రక్షకుణ్ణి కాగలిగాననే దుర్గర్వంతో దూసుకువచ్చి శివ తపోభంగానికి తలపడిన మన్మథుని మనోమథనం మూర్తి గట్టింది.
“పరివర్తన"లో వల్లమాలిన అహంకారంతో తమ్మునితో తగాదాకు దిగి, రామబాణం తగిలి నేల కూలిన వానరరాజు వాలి వ్యాకుల హృదయం వ్యక్తమయింది.
“భ్రష్టయోగి"లో పరమతపోనిష్ఠకు ప్రయత్నించినప్పటికీ ప్రకృతిని జయించలేక పోయిన ఒక యోగివరుని తలపులు తేటతెల్లమైనాయి.
ఇక కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుని ఉపపత్నీ, సంగీత నాట్యకళా విశారదా అయిన మాచలదేవి ఔన్నత్యమూ, ప్రత్యేకతా "మాచల దేవి” అన్న కవితలో కళ్ళకు కట్టించబడినాయి.
“ఆత్మార్పణం” అన్న కవితలో కర్ణుని స్వామిభక్తీ, మైత్రీ మాధుర్యమూ, ధర్మాధర్మ విచికిత్సా, ఉచితజ్ఞతా, పరాక్రమ ప్రదర్శనాభిలాషా, కృష్ణభక్తి, అచంచల స్వభావమూ. ఆత్మాభిమానమూ, సత్యసంధతా స్పష్టమైనాయి.
“స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురీ మహిమ?” అని ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలచే ప్రశంసింపబడిన శివభక్త శిఖామణి ధూర్జటి మహాకవి హృదయఘోష, “విన్నపం” అన్న ఖండికలో నిండుగా నింపబడింది.
"బృహన్నలాశ్వాసం” అన్న చిట్టచివరి కవితాఖండికలో ఆడవారి యెదుట బీరాలు పలికి ఆడంబరంగా కౌరవులతో యుద్ధానికి సిద్ధమైన ఉత్తర కుమారుడు, సమయానికి వెన్ను చూపి రథం దిగి పారిపోతుంటే, బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు అతనిని ఊరడించి ధైర్య స్థయిర్యాలను నూరిపోయటం వెల్లడింపబడింది.
ఈ విధంగా విభిన్నవ్యక్తుల హృదయాలలోకి పరకాయ ప్రవేశం చేసి, వారి వారి చిత్తవృత్తులను వివిధ రీతులలో చిరస్మరణీయంగా చిత్రించారు శ్రీసోమయాజులు గారు తమ “శివాలోకనం"లో.
చిత్రం ఏమిటంటే “శివాలోకనం” అనే పేరుతో ప్రత్యేకమైన కవిత లేకపోయినప్పటికీ కవితాసంపుటి మొత్తానికి ఆ పేరు పెట్టి తమ నామౌచిత్య పాటవాన్ని ప్రకటించుకున్నారు వావిలాలవారు. అన్ని కవితలలోనూ అంతస్సూత్రం "శివాలోకనమే” అన్న రచయిత క్రాంతదర్శనానికి అది నిదర్శనం.
16
వావిలాల సోమయాజులు సాహిత్యం-1