పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/138

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'కోకిలా!'


ఉ. ఈసు వహింప నీప్రకృతియెల్ల రసాల మనోజ్ఞ శాఖికా
వాసము నుండి యిట్లు మధుభావ రసస్ఫుర ణైక గీతు లీ
నో సరసావతంస! రహి నుజ్జ్వల లీలగ నాలపింతు సు
శ్రీసముదీర్ణ గాత్ర పరిలీయసుధారవ మెట్టు లబ్బెనో!

ఉ. నీ సుకుమార మంజుల వినిస్వనముల్ హృదయాబ్జ భావ ని
శ్వాస పరీమళమ్ములు, వసంత మనోహర కీర్తి మల్లికా
న్యాస విలాస హాసములు, యౌవన చైత్రలసన్నవో దయ
శ్రీసముపేత దివ్య లవలీ నవలాస్యములో పికప్రభూ!

శా. తావుల్ జిమ్ముచు పంచమ శ్రుతిని వేదార్థంబులన్ బల్కు నీ
భావానంత సురమ్య కావ్య నిచయ ప్రౌఢ ప్రసూనావళుల్
కావా సంహిత కోశముల్ - మరల వ్యాఖ్యానింపగా ద్రష్టయౌ
నేవాల్మీకియొ పుట్టగా వలెను గాదే భూమి పుంస్కోకిలా!

ఉ. ఈ మధు మాసవేళను వనేందిర కొల్వున నీవు శబ్ద రే
ఖా మృదుచిత్ర రూపముల కల్పన సేసి యనంత భావ మా
లా మధురాళికై, మరల రాగల వత్సర లక్ష్మికై సఖా!
ఏ మహనీయ భూములకు నేగెదవోయి తపస్సమాధికై?

శా. స్వేచ్ఛాజీవన భావ గంధములు వాసించున్ భవత్కంఠ వీ
ణాచ్ఛస్వాధ్యయనమ్ము అందు కలదయ్యా శ్రీస్వరూపమ్ము, మా
తుచ్ఛాసక్తు లసత్పథానుగత వృత్తుల్ మాన్ని సద్బోద్ధవై
స్వచ్ఛానంద సుధాప్రవాహలహరీ స్నానమ్ము లాడింపవే!

ఉ. రాగల జన్మలో విహగరాజ! భవత్రియనై జనించి నీ
తో గళ మెత్తి కల్పి, మధుతుంది మోహనరాగ కల్పనో
ద్వేగములోన మూగనయి దివ్య సుషుప్తి వహింప నెంతు నా
శాగతి యెట్టులున్నదొ ప్రసాదిత గాత్ర పవిత్ర! మిత్రమా!!6

'(హిందూ కళాశాల పత్రిక)'


138

వావిలాల సోమయాజులు సాహిత్యం-1