ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ యధ్యాయము

87


సాధ్యమై యుండెను. అందులకై యనేకులు ప్రయత్నించిరి. భోజరాజీయమును విరచించిన యనంతామాత్యకవి ముత్తాతయగు బయ్యనమంత్రి కవిత్వముచెప్పి తిక్కనసోమయాజిని మెప్పించి 'భవ్యభారతి' యనుబిరుదమును బొందె ననిభోజరాజీయమునందలి యీక్రిందిపద్యమువలన విదితమగుచున్నది.

"చ. క్షితిఁ గ్రతుకర్తనా వినుతి చేకొని పంచమవేదమైన భా
     రతముఁ దెనుంగుబాస నభిరామముగా రచియించి నట్టి యు
     న్నతచరితుండు తిక్కకవినాయకుఁ డాదట మెచ్చి భవ్యభా
     రతియనఁ బేరుఁగన్న కవిరత్నము బయ్యనమంత్రి యల్పుఁడే."

కేతనకవి గూడ,

“గీ. కవిత చెప్పి యుభయకవిమిత్రు మెప్పింప
    నరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ
    బరగుదశకుమార చరితంబుఁ జెప్పిన
    ప్రోడ నన్ను వేఱ పొగడ నేల?"

అని యాంధ్రభాషాభూషణ మన గ్రంథమునందుఁ జెప్పి యున్నాఁడు. ఆకాలమునందు కవులు తిక్కనసోమయాజివలన మెప్పు నొందినఁ దమజన్మసార్థకమైనట్లుగాఁ దలంచుచుండిరి. అట్టివారిలోఁ గేతనకవి యొక్కఁడు. ఇతఁడు కేవలము ధనాపేక్షచేఁ తిక్కనసోమయాజిని స్తోత్రపాఠములు చేసి కృతి నిచ్చిన వాఁడు గాఁడు. వేగీదేశమున వెఱ్ఱిరాల యనునగ్రహారమునకు నగ్రణియును గౌండిన్యగోత్రుఁడును, మారయకును సంకమాంబకును దనూజుఁడును, బండారు కేత దండాధీశుని మఱదియు, నధ్యయనపరుఁడును, మూలఘటికాన్వయుఁడును, ప్రోలనార్యు