ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ యధ్యాయము

83


రఁగుఁ డైనట్లు వ్రాసికొన్నది. తానట్టివాఁడగుట యథార్థమై యుండుటచేతనేగాని తనడంబమును లోకమునకుఁ బ్రకటించుకొనుటకై కాదు. తిక్కన డంబము చూపువాఁడు గాఁడు. ఈ సత్యము నెఱింగినవాఁడు గనుకనే సమకాలికుఁ డైన కేతనకవి

"క. అభినుతుఁడు మనుమభూవిభు
    సభఁ దెనుఁగున సంస్కృతమునఁ జతురుండై తా
    నుభయకవి మిత్రనామము
    త్రిభువనముల నెగడ మంత్రితిక్కఁడు దాల్చె౯."

అని యాతని కుభయకవిమిత్రుఁ డనుబిరుదముగల దనితెలిపియున్నాఁడు. ఇది యొకసామాన్యపుబిరుదము గాదు. ఇం దెంతు మహిమ గలదు. 'కవిపంచాననుఁడు, కవిరాజు, కవిసార్వభౌముఁడు, కవిలోకచక్రవర్తి' మొదలుగాఁగల కొన్నిబిరుదములవలె దుర్గర్వమును, దుస్స్వభావమును, అసహిష్ణుత్వమును బ్రేరేపించి తగవులను బుట్టించి సౌజన్యమును రూపుమాపునట్టి మిథ్యాబిరుదములవంటిది గాదు. మిత్రశబ్ద మెప్పుడును ప్రేమను దెలుపుచుండును. ఉభయకవిమిత్రుఁ డనఁగా సంస్కృతాంధ్రకవులను బ్రేమతోఁ జూచువాఁ డనియర్ధము. ఇతనికవితాసామ్రాజ్యము ప్రేమాపూర్ణమగుటం జేసి కవిలోకమున కాశ్రయమై జగత్పూజ్యం బయ్యెను. ఇతఁ డాంధ్రకవితాసామ్రాజ్యపట్టాభిషిక్తుఁడై కవిప్రపంచమును ప్రసన్న దృష్టితో వీక్షించెను. అప్పుడు కవిప్రపంచ మానందాబ్దినోల లాడుచు నిట్లు వినుతించెను.