ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ యధ్యాయము

39


కాంచీపుర చాళుక్యచోడులును హోరాహోరిగఁ బోరాడుచుండిరి. చాళుక్యచోడ సామ్రాజ్యము నశింపగాఁదత్సింహాసనమునకై చోడులలోఁ జోడులకు నంతఃకలహములు పుట్టి తమలోఁ దాముపోరాడుచు నన్యుల సహాయమునువేడుచు నేతన్మూలమునఁ గ్రమక్రమముగా స్వాతంత్ర్యములను గోలుపోవుచు ననేక కష్టములంబడుచుండిరి. పూర్వము పశ్చిమచాళుక్యులు పరిపాలించిన కుంతలదేశము యొక్క ప్రాగ్భాగమును గాకతీయాంధ్రులును ఉత్తరభాగమును దేవగిరియాదవులును, దక్షిణపశ్చిమభాగములను హోయిసలకర్ణాటులు నాక్రమించుకొనిరి. కావున మనమసిద్దిభూపాలుని కాలమున రాజకీయవాతావరణములో దెలుఁగుచోడు లసుఖస్థితి యందున్న వారని చెప్పవలసియుండను. మనుమసిద్దిభూపాలుఁడు గొంతకాలము చాళుక్య చోడచక్రవర్తి యగు మూఁడవరాజేంద్రచోడునకు సామంతుఁడుగ నున్నట్లే గానంబడుచున్నాఁడు. అయినను యుద్ధములు వచ్చినప్పుడు తోడ్చడుట తక్క తదితరవిషయములలో స్వతంత్ర పరిపాలనమునే చేయు చుండెను. ఎట్టులయినను మనుమసిద్ది రా జిరువదిసంవత్సరములు రాజ్యపరిపాలనము చేసినట్లు గనం బడుచున్నది.

మనుమసిద్ది శత్రురాజులను జయించుట

తిక్కన తననిర్వచనోత్తర రామాయణమున మనుమసిద్ది భూపాలుని విజయములను బేర్కొని యుండెను. అందు మొదటి పద్య మిట్లున్నది.