ఈ పుట ఆమోదించబడ్డది

2

తిక్కన సోమయాజి


తిక్కన వంశము. మంత్రిభాస్కరుఁడు

బ్రహ్మర్షి యగు గౌతమునిపావనగోత్రంబున మావెన మంత్రి జనించెను. మావెనపూర్వులు కొట్టరువుగ్రామంబునఁ బెద్దకాలము నివసించినవా రగుటంజేసి వారికి గొట్టరువువా రని యింటిపేరు గలిగినది. కొట్టరువు మావెనమంత్రికిఁ గేతనయు నాతనికి భాస్కరమంత్రియు జనించిరి. ఆకాలమునం దాఱ్వేలనాటిలోఁ (గుంటూరుమండలము) బ్రఖ్యాతి కెక్కిననియ్యోగి బ్రాహ్మణ కుటుంబములలో మంత్రిభాస్కరుని కుటుంబమొక్కటి. కొట్టరువు వంశమున భాస్కరమంత్రి యుదయించి పండ్రెండవశతాబ్ద్యంతమునఁ బూర్వచాళుక్యచోడ చక్రవర్తులకుఁ బ్రతినిధులై వేఁగీదేశ మని వ్యవహరింపఁబడెడు నాంధ్రభూభాగమును బరిపాలించుచున్న చందవోలురాజుల యధికారముక్రిందను గుంటూరిసీమను బరిపాలించి విఖ్యాతిఁగాంచెను. ఆకాలమునఁ బూర్వచాళుక్యచోడచక్రవర్తికి నామమాత్రప్రతినిధియై పృథ్వీశ్వరమహారాజు ధనదుపురము (చందవోలు) రాజధానిగా విక్రమ సింహపురము మొదలుకొని సింహాచలము పర్యంతము నాంధ్రదేశమును బరిపాలించు చుండెను. పృథ్వీశ్వరుఁడు చాళుక్యచోడచక్రవర్తికి లోఁబడినవాఁ డని చెప్పుకొనఁబడుటయెగాని క్రీ. శ. 1299. వఱకును స్వతంత్రుఁడై పరిపాలనము చేసెను. అతనిక్రిందియధికారులలో నొక్కఁ డై గుంటూరిసీమను బరిపాలించినవాఁడు మంత్రి భాస్కరుఁడు.