ఈ పుట ఆమోదించబడ్డది

దీవెన విన్న మిగత శిష్యులందరు ఆశ్చర్యపోయారు. ఆ సమయములో తమకు కల్గిన ఆ ఆశ్చర్య విషయమును గురించి గురువుగారిని అడుగలేదు. తమలో తాము ఆ విషయమును కొన్ని రోజులు చర్చించుకొన్నారు. చివరకు గురువుగారు ఇచ్చిన దీవెన తప్పని తలచి, ఆ సంశయము గురువుగారే తీర్చవలెనని ఈ విధముగ అడిగారు.


శిష్యులు : స్వామి మాకొక సంశయము చాలా రోజులనుండి పీడించు చున్నది. ఆ సంశయమునకు మీరే జవాబు చెప్పగలరని వినయముగ అడుగుచున్నాము.

గురువు : మీ జ్ఞానమునకు అర్థముగాని సంశయమేమిటి?

శిష్యులు : అవినాశ్‌కు మీరు ఇచ్చిన దీవెనయే మాకు అర్థముకాలేదు స్వామి.

గురువు : అందులో అర్థము కానిదేమున్నది?

శిష్యులు : మీరు అవినాశ్‌ను దీవిస్తూ "నీవు నాశనమై పోనాని" అన్నారు. మరణముతో జీవుడు నాశనము కాడు. కర్మ అయిపోయినపుడే నాశనమగు నని చెప్పారు. కర్మఅనుభవించనిదే పోదు. లేక యోగము చేయనిదేపోదు. అటువంటపుడు మీమాట జరుగునా అన్నదే సంశయము.

గురువు : కర్మ విషయములో మీరు చెప్పిన పద్ధతి సరియైనదే. కాని మరొక పద్దతి కూడ కలదు. జ్ఞానాగ్ని అమితముగనున్నవారు వారి సంకల్పము చేత ఎదుటివాని కర్మను కాల్చవచ్చును. ఆ విధముగ సంపూర్ణ యోగులై బ్రహ్మర్షి హోదా కల్గినవారు మాత్రము చేయగలరు. కర్మ లేకుండపోతే జీవుడు నశించి పరమాత్మగ మారగలడు. అవినాశ్‌ను నేను దీవించడములో అదే అంతరార్థము గలదు. అవినాశ్‌ అంటే నాశనములేనివాడని అర్థము కదా! అపేరు సార్థకమగునట్లు అతడు జీవునిగకాక నాశనములేని దేవునిగ మారిపోవలెనని, జీవాత్మవైన నీవు నశించి పోవాలని దీవించాను.