ఈ పుట ఆమోదించబడ్డది

నాడుల విషయము తెలిసిన జ్ఞానులు వాటిని బయటికి కనిపించునట్లు పెట్టారు. నేడు పూర్వపు పద్ధతిని కొందరు అనుసరించి నుదిటిమీద నామములు దిద్దుకొన్నప్పటికి వాటి అర్థము తెలియదు. నామము పెట్టుకొన్నవారు వైష్ణవులని అనుకోవడము జరుగుచున్నది. లోపలి నాడుల ఉనికిని తెలియజేయుటకే నామములు పెట్టడమని ఎవరికి తెలియకుండ పోయినది. మూడునాడులలో సూర్యచంద్రనాడులనబడు రెండు నాడుల యందు మనస్సు జాగ్రత్తావస్థలో ఉండును. బ్రహ్మనాడిలో ఉన్నపుడు నిద్రావస్థలో ఉండును. మూడునాడులు పైన కనిపించు కనుబొమలకు మధ్యభాగమున తలమద్యలో కలిసియుండును. ఈ మూడునాడులు కలియుచోటును త్రివేణిసంగమమని, గంగ యమున సరస్వతి కలియుచోటని అనుటగలదు.


మూడునాడులు కలయుచోటునే మూడుదోవలు కలిసిన చోటని అనడము జరుగుచున్నది. శరీరములోని మనస్సును మూడునాడులు కలియు భృకుటి స్థానములోనే లగ్నము చేసి బయటి చింతలు లేకుండ చేయడమునే బ్రహ్మయోగము అంటున్నాము. మనస్సు మెలుకువలోను నిద్రలోను లేకుండ లోపల జ్ఞప్తికల్గి బ్రహ్మనాడిలో సూర్యచంద్రనాడులు కలయు చోట తలమద్యలో నిలువడమును బ్రహ్మయోగమంటాము. కావున 'మూడుదోవలు కలియుచోట ముండమోయనాని' అని పూర్వము దీవించెడి వారు. జ్ఞానపద్ధతి ప్రకారము గొప్ప ఉద్దేశముతో దీవించిన దీవెన నేడు అజ్ఞానముతో దూషించు తిట్టుగ మారిపోయినది. పూర్వము గొప్ప జ్ఞానులైన గురువులు మహర్షులు తమవద్దకు జ్ఞాననిమిత్తము వచ్చినవారికి తొందరగ జ్ఞానము కలుగవలెనని, వారు తొందరగ మోక్షము పొందవలెనని దీవించెడివారు. బ్రహ్మయోగము లభ్యము కావలెనని దీవించిన మాటయే 'నీముండమోయనాని' అని తెలుసుకొన్నాము.

-***-