ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

తిమ్మరుసు మంత్రి


పెద్దకోరికఁ గలదు. ఇంతియ గాక యింతసామ్రాజ్యభారమును వహించి నేను కేవలము నాకు సామంతులుగ నున్నవారికడ నుండు సైన్యముల నమ్మి యుండుటకంటె సొంతబలమును గూర్చుకొని యుండుట నాకు శ్రేయస్కరమనుట నీ వెరుంగనిది కాదు. అట్టిబలమును నాకు సమకూర్చి పెట్టవలయును.

అని ప్రార్ధించిన నతడు చిరునవ్వు నవ్వచు 'ప్రభూత్తంసమా! ఇంతమాత్రమునకై నీవు పెద్దగా యోజింప వలయునా? నీమనోభీష్టము ప్రకారము సమస్తకార్యములను జక్కఁబెట్టెదను. ఇంక జుగుసేయక వైళంబ లెమ్ము. మన మిచ్చటనుండుట తగదు. బయలువెడలుద' మని పలికి యతని నొక యేనుఁగుపై నెక్కించి రక్షకసైన్యము వెంటనంటిరాఁగా రాజభవనమునకుఁ దోడ్కొని వచ్చెను,

తిమ్మరుసు హితబోధ

అట్లు రాయనిఁ దోడ్కొనివచ్చి 'మహారాజేంద్రా! అంగరక్షకసైన్యము లేకుండ నొంటరిగ స్వమందిరమును విడిచి యిఁకముం దెచ్చటికి బోనని నాకు వాగ్దానము చేయు” మని ప్రార్థింప నామంత్రిపుంగవుని ప్రార్ధనమును మన్నించి యతం డట్ల వాగ్దానము చేసెను. అప్పుడు తిమ్మరుసు సంతోషసాగరమునఁ దేలియాఁడుచుఁ దనయేలికతోడ నిట్లు మనవిచేసెను.

దేవా ! మీచిత్తానుసారము దిగ్విజయయాత్ర కనుకూలములైన ప్రయత్నములను జేయుటకు నాకు రెండు సంవత్సర