ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థ ప్రకరణము

61


వీరనరసింహరాయని తీర్థయాత్రలు.

అట వీరనరసింహరాయఁడు ప్రతాపవంతుఁడై శత్రుజనభయంకరుఁడై దక్షిణదిగ్విజయాత్రకై బయలువెడలి తిరస్కరించిన పాలెగాండ్రను దొలఁగించి వారిస్థానముల గ్రొత్తవారిని నియమించుచు, తన్నెదుర్కొని పోరాడినవారిని రూపుమాపుచు దక్ష్మిణసముద్రమువఱకుఁ బోయెను. పాండ్య, చోళ, చేరచేశములలోని రాజు లెల్లరును గప్పములను సమర్పించి స్నేహము చేసికొనిరి. ఈదండయాత్రలో వీరనరసింహరాయని నెదిరించి మార్కొని పోరాడిన వారిలో నొక్కఁడును దప్పించుకొనిపోయి యుండలేదు. అతఁడు సామ్రాజ్యమంతటను సంచారముచేసి తన ప్రభుత్వమును స్థిరపఱచుకొని భుజబలవీరనరసింహరాయఁ డని ప్రసిద్ధి గాంచెను. అతఁడు కంచి, పక్షితీర్ధము, కుంభకోణము, చిదంబరము, జంబుకేశ్వరము, శ్రీరంగము, మధుర, రామసేతువు, గోకర్ణము, కాళహస్తి, అహోబలము, శ్రీశైలము, త్రిపురాంతకము, వేంకటాచలము, సంగమేశ్వరము మొదలగు బహుపుణ్యక్షేత్రములను సేవించి దేవబ్రాహణ భక్తి కలిగి బ్రాహ్మణుల కనేకభూదాన గోదాన సువర్ణదానముల నొసంగి, ప్రఖ్యాతిఁ గాంచెను. ఇట్లొకటి రెండు సంవత్సరములలో శత్రుల నందఱను జయించి కప్పముల నేర్పాటు చేసికొని రాజధానిఁ బ్రవేశించెను.