ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

తిమ్మరుసు మంత్రి


కృష్ణరాయని నెదుర్కొనియెను. కర్ణాటదేశములోఁ గావేరీతీరమునందున్న బలాఢ్యములైన దుర్గములలో శివసముద్రము మొట్టమొదటిదిగా నెన్నవలసినదై యున్నది. అటుపిమ్మట కృష్ణరాయఁడు గంగరాజునకు శత్రువైన చిక్కరాయఁ డను పాలెగాని వశపఱచుకొని మఱికొందఱు పాలెగాండ్రనుగూడఁ జేరఁదీసి ప్రేతపర్వతము, గౌరికొండలనడుమ దండుదిగి కావేరి కనుమమార్గములో శత్రువుల నడ్డగించి శివసముద్రమును సంవత్సరమువఱకు ముట్టడించెను. అపు డాగంగరా జాయవమానమును భరింపజాఁలక కావేరిమడుగులోఁ బడి ప్రాణత్యాగముఁ జేసెను. కృష్ణరాయఁడు శివసముద్రమును స్వాధీనపఱచుకొనియెను. అటుపిమ్మట నాతఁడు మఱికొన్ని పాలియంపట్టులను జయించి కర్ణాటదేశమునకంతకు శ్రీరంగపట్టణము నధికారస్థానముగా నియమించి శంఖచక్రములు గల ధ్వజము (కృష్ణరాయని ధ్వజము) నెత్తించి కర్ణాటదేశములోని పాలెగాండ్రందఱును కప్పముక్రిందను గోటిద్రవ్యము నిచ్చునటు లేర్పాటుచేసి రాజధానికి మరలి వచ్చెను. కృష్ణరాయనికీర్తి యావిజయముతో దేశమంతట వ్యాపించుటయె గాక శత్రురాజుల కాతనిపేరు చెప్పిన భయము కలుగుచుండెను. తిమ్మరుసుమంత్రి తనశిష్యుఁడైన కృష్ణరాయఁ డట్టి విజయమును గాంచినందుల కపరిమితా నందమును బొంది యతని బహువిధముల శ్లాఘించెను.