ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థ ప్రకరణము

53


కముగా నీసామ్రాజ్యమును బరిపాలింపఁగలఁడు. నాపుత్త్రు లన్యోన్యము మత్సరగ్రస్తులై తగవులాడకుండఁ జూచుచు వారలను సంరక్షించుభారము నీయది. ఇమ్మడి నరసింగరాయనిచేఁ గాని వానివంక వారిచేఁ గాని యేవిధమైన యుపద్రవము పొడమకుండ సామ్రాజ్యమును సంరక్షింపఁగల సమర్ధుండవు నీవొక్కడవే సుమా."

అని పలికి పుత్రులం బిలుపించి 'పుత్త్రకులార ! తిమ్మరుసు నేఁడుమొదలు మీకు రక్షకుఁడు కాబోఁవు చున్నాడు ; సకలకార్యనముర్థుండైన తిమ్మరుసు చెప్పినట్లు వర్తింపుఁడు : దాన మీకు సౌభాగ్యమును శ్రేయస్సును గలుగును. నేను బ్రతికియుండఁగా గృష్ణకు దిగువ భాగమున నశ్వపతులకు, గజపతులకు రాజ్యము లేకుండఁ జేయవలయునని యెంతయో ప్రయత్నించితిని గాని దాని నెఱవేర్చు భాగ్యము నాకు లభించినదికాదు; ఎంతకాలము తురుష్కులు ముదిగల్లు, రాచూరు దుర్గములను స్వాధీనములో నుంచుకొనఁ గలుగుదురో అంత పర్యంతము సామ్రాజ్యమునకు క్షేమములేదని యెఱుంగుఁడు. దక్షిణహిందూస్థానమున మీప్రతిష్ఠ నిలుపుకో దలఁచిన పక్షమున నేను సాధింపఁజాలక విడిచిపెట్టినదానిని మీరు సాధింప వలయును; తిమ్మరుసుబుద్ది ననుసరించి వర్తింతురేని జయ మవశ్యము మీకు లభ్యమగు ననుటకు నెంతమాత్రము సందియములేదు" అని చెప్పి వెంటనే ప్రాణములను విడిచి కీర్తిశేషుఁడై లోకాంతరగతుఁడయ్యెను.