ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

తిమ్మరుసు మంత్రి


డైన శ్రీకృష్ణదేవరాయనికి విద్యాగురువునుగా సరసింహదేవరాయఁడు నియమించెను. తనపుత్రులలో సమస్తవిధముల గృష్ణదేవరాయఁడే సుభగుం డని తన సమ్ముఖమునఁ బలుమాఱు తిమ్మరుసు ప్రశంసింపుచు వచ్చినందున నరసింహదేవరాయఁడు నొకింత యధికముగాఁ గృష్ణదేవరాయని బ్రేమింపుచు వచ్చెను. ఇది యంతయును దిప్పాంబకు నురిసిన పుండులో నుప్పుపెట్టిన చందముగా నుండెను. తనకుమారుని పట్టాభిషిక్తునిఁజేయక సపత్నీపుత్రుఁడైన కృష్ణదేవరాయనికే నరసింహదేవరాయఁడును తిమ్మరుసుమంత్రియుఁ బట్టము గట్టుదురని మనంబున నిశ్చయించి యొకనాడు తిప్పాంబాదేవి యిట్లు దురాలోచనము చేసెను.

"రాయనికి నామీదఁకంటెను నాగాంబికయం దెక్కువ యనురాగము గలదు. రాజునెడ నాగాంబకుఁ గలచనువు నాకు లేకయున్నది. రాజ్యతంత్రమునునడపు తిమ్మరుసుమంత్రి కృష్ణరాయనికి విద్యాగురువయ్యెను. అందుచే మంత్రి కృష్ణరాయని సరసరాయని సమ్ముఖమున స్తుతిపాఠములు చేయుచు నాతనియెడ రాయనికిఁ బ్రేమ మధిక మగునట్లు చూచుచున్నాఁడు. రాజ్య మన్ననో వంశక్రమాగత మైనదికాదు. ఇప్పటికి రెండు వంశములు గడచినవి. మూఁడవవంశమునకుఁ దక్కు నని యెట్లు చెప్పనగును? ఈమంత్రిసత్తముఁడు రాయని మరణానంతరము కధ యెట్లు నడిపించునో యెవ్వరు చెప్పఁ గలరు?