ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

తిమ్మరుసు మంత్రి


యాతని సంరక్షణార్థము కొంతసైన్యమును నిలిపి పేరున కిమ్మడి నరసింహరాయఁడే రాజేంద్రుఁడైనను వ్యవహారమున మాత్రము తుళువనరసరాయఁడే మహారాజేంద్రుఁడై సమస్త రాజ్యభార ధురంధరుఁడై ప్రవర్తిల్లెను. అతనియాజ్ఞ సామ్రాజ్యమునం దంతట నమోఘముగా నిర్వర్తిలు చుండెను. అత్యధిక ప్రతిభావంతుఁడైన సాళువతిమ్మనామాత్యుఁడు మహాప్రధానియై రాజ్యతంత్రమును నడుపుచుండఁ దుళువనరసరాయనికీర్తి జగద్వ్యాప్త మగుచుండెను. తిమ్మరుసుమంత్రి సామ్రాజ్యమున కంతకు మూలస్థంభ మయ్యెను. ఎవ్వనిపలుకు సామ్రాజ్యమున నప్రతి హతమై ప్రవర్తించు చుండెనని ప్రశ్నించితిమేని తిమ్మరుసునే మొదట చెప్పవలయును. మహారాజులు, మండలేశ్వరులును, మంత్రులు సేనానులు మొదలగువారెల్లరు నాతని యాజ్ఞా బద్దులై ప్రవర్తించుచుండిరనఁ దక్కినవారిసంగతి చెప్పనేల?

తురుష్కుల జయించుట.

విజాపురసుల్తానగు ఆదిల్‌షాహ ప్రత్యర్ధియగు కాశిం బరీదు తన ప్రతిపక్షిని జయించుటకై తనకు సాహాయ్యము చేయవలసినదని నరసరాయనిఁ బ్రార్థించెను. అతఁడు తిమ్మరుసుతో నాలోచింపగా నాతఁడిట్లనియె. "విజాపురసుల్తాను మసకు శత్రువు, కాశింబరీదును మనకు శత్రువు. మనకు శత్రువులుగ నుండువారు తమలోదాము పోరాడునపుడు మనమొక