ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

తిమ్మరుసు మంత్రి


గల్పించు జాబులను వ్రాసి విశేషముగా ద్రవ్యమును దెప్పించి పదియాఱు పెట్టెలలో నిండించి యొక్కొక్కజాబు నొక్కొక్క పెట్టలోనుంచి యాపెట్టెలను బరిచారకుల శిరస్సులపై నుంచి శత్రుసైన్యములోనికిఁ బోయి పాత్రసామంతుల కప్పగించి ప్రత్యుత్తరములు తెండని యజ్ఞాపించిపంపెను. వారలు గజపతి సేనలమధ్యనుండి పెట్టెలను గొనిపోవుచుండ గజపతి వారలనుబట్టి తెప్పించి యాపెట్టెలను గైకొని యందుండు లేఖలను దీసి చదువుకొనఁగాఁ దనపాత్రసామంతులు దనకై కుట్రచేసి రాజద్రోహమున కొడిగట్టినట్లు స్పష్టపడియెను, జాబులలో నిట్లు వ్రాయఁబడి యుండెను.

"శ్రీకృష్ణదేవరాయలవారు మీపద్ధతుల కంగీకరించెను; ఆపద్ధతుల ప్రకారము గజపతిని బట్టి యిచ్చెదరేని మీరు నిర్ణయించిన ప్రకారము గ్రామములును, రత్నాభరములును, ధనమును మీయధీనము చేసెదము."

ఇట్లుండుటను ప్రతాపరుద్రగజషతి చదువుకొని భీత చిత్తుఁడై తాను తప్పించుకొని పోవుమార్గము నాలోచించు కొని పాత్రసామంతులకుఁ దెలియకుండ నితరులకు గోచరము గాకుండ దూరమున నున్న మఱియొకస్థలమునకుఁ బోయి యచ్చట రహస్యముగా నుండెను. తమప్రభువు యుద్ధభూమి యందుఁ గానరాకుండుటం జేసియు, నతనిక్షేమము దెలియ కుండుటంజేసియు వారలు యుద్ధమును ముగించి విచారించు