ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

తిమ్మరుసు మంత్రి


కృష్ణరాయఁడు తన కపజయము కలుగునని యూహించి తిమ్మరుసు గఱపిన హితోపదేశమును బెడచెవినిబెట్టి, యిట్టి విపత్తు తెచ్చికొంటిని గదా యని పశ్చాత్తప్తుఁడగుచు, మంత్రిని బిలువ నంపించి, తానడిచిన మార్గము తప్పని యొప్పుకొని, కర్తవ్య మాలోచింపుమని, బహుభంగుల వేడికొనియెను. అప్పుడు తిమ్మరు సిట్లనియెను.

దేవా! మనము మనరాజధానిని విడిచి బహుదూరము ప్రయణముచేసి శత్రుదేశమధ్యమునఁ జిక్కువడి యున్నవారము. దేశ మరణ్యమయమై యుండుటచేత సులువుగా మన సైన్యములను మరలించుకొని పఱువిడి పోవుటకు సాధ్యము గాదు. కీడెంచి మేలెంచు మన్నట్లు మన కదృష్టము తప్పేనేని మనసైన్యమంతయు నీకళింగదేశపుటడవులలో హరించిపోవుననుటకు సందేహములేదు. అపాయము కల్గెనా యింక మన దురవస్థ చెప్పనక్కఱలేదు. మనకు స్థానబలిమిలేదు. వారలకు స్థానబలిమి కలదు. ఇంక నసంఖ్యాకములగు సైన్యములను గొనివచ్చి గజపతి మనపైఁ బడఁగలఁడు. జయాపజయములు భగవదధీనములు. ఐనసు నిప్పటి పోరాటముయొక్క స్థితినిబట్టిచూడ మనకు జయము కలుగునని తోఁచదు. ఇట్టి సందిగ్ధసమయమున యుద్ధమును మాని వెనుకకు మరలుట ప్రమాదమునకు హేతువగును. ఏదైన మాయోపాయముచేత నీవిపత్తునుండి తప్పించుకొని కార్యమును సాధింపఁజూడవలయునుగాని విచారించుట వలనఁ బ్రయోజనము లేశమాత్రమునులేదు.