ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్ఠమప్రకరణము

115


వేయవలసిన దనియు రాయనికిఁ జెప్పెను. అతఁ డందుల కంగీకరించి తక్కిన సేనానులను గూర్చుకొని కృష్ణానదీప్రాంతముస గజపతి సైన్యములతోఁ దలంపడి ఘోరమైన యుద్ధము గావించెను. కృష్ణరాయఁడు కృష్ణ దాటి వేడూరుకడను ప్రతాపరుద్రగజపతిని మార్కొని యుద్ధము చేసి యోడించి తఱిమెను. ఇక్కడ తిమ్మరుసుమంత్రి రెండుమాసములకుఁ బై గా ముట్టడించియుండి శత్రుదుర్గమును క్రీ.శ. 1515.దవ సంవత్సరము జూనునెల 23. తేదిని స్వాధీనపఱచుకొని వీరభద్రగజపతిమొదలుగా పాత్రసామంతుల నందఱను జెఱఁగొనియెను. ప్రతాపరుద్రుని హతశేషసైన్య మంతయును జెల్లాచెదరై పోయెను. తిమ్మరుసుప్రతిజ్ఞ నెఱవేఱెను. కృష్ణకు దక్షిణభాగమున గజపతిప్రభుత్వము తుదముట్టెను. కృష్ణరాయఁడు కొండపల్లి దుర్గమును మూఁడునెలలు ముట్టడించి స్వాధీనపఱచుకొని ప్రతాపరుద్రగజపతి భార్యలలో నొక్కతెను, పలువురుసేనానులను జెఱఁగొనియెను. శ్రీకృష్ణదేవరాయఁడు పూర్వదిగ్విజయయాత్రలోఁ జెఱగొన్న గజపతిసంబంధీకుల నెల్లరను విజయనగరమునకుఁ బంపివేసెను. కొండవీటిరాజ్యమును బరిపాలించుటకై రాయఁడు తిమ్మరుసునే పాలకునిగా నియమించెను. కాని కృష్ణరాయని వెంబడించి పోవుట కై తిమ్మరుసుమంత్రి తన మేనల్లుఁ డైననాదిండ్ల అప్పామాత్యునికి కొండవీటిరాజ్యమున కాధిపత్య మొసంగెను.