ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

తిమ్మరుసు మంత్రి


అవసరమైనప్పుడు తెప్పించుటకై మూడులక్షల సైన్యమును నగరమున గోవిందామాత్యుని యాధిపత్యముక్రిందను మూలబలముగా నుంచెను. అట్లుంచి, విస్ఫురితభూషణభూషితంబైన గంధసింధురంబునెక్కి వెలిగొడుగులు మెఱయ నలంకారంబులఁ దఱచైన వజ్రంబుల నుద్దామంబులగు దీధితిస్తోమంబులును జూమరంబులును గలయం బొలయ బహురత్న ప్రభాసితంబైన గరుడధ్వజంబుఁ గ్రాలుచుండఁ గృష్ణదేవరాయ ధరణీవల్లభుండు తనరాణులతోఁ జనుదేర సకలచమూపతిత్వపదభాసితుఁడైన తిమ్మదండనాధాగ్రణి సమస్త సైన్యములను నడిపించుకొనుచు దండయాత్ర బయలువెడలెను. అల్లసాని పెద్దనామాత్యుఁడు, నంది తిమ్మనామాత్యుఁడు మొదలగు కవివర్యులును, రంగనాధ దీక్షితులు, మొదలగు రాజపురోహితులును, వైష్ణవస్వాములగు తాతాచార్యాది గురుజనంబులును, మఱియు ననేక బ్రాహ్మణ విద్వద్బృందమును, వారి ననుగమించిరి. ఒకమహానగరము శుభోత్సవమునకై తరలిపోవుచుండున ట్లుండెను.

ఉదయగిరి ముట్టడి

ఇట్లు క్రీస్తుశకము 1513 వ సంవత్సరములోఁ బూర్వ దిగ్విజయమునకై దండయాత్ర వెడలి రాయనిసైన్యంబు వచ్చుచుండఁ జారులవలన నంతవృత్తాంతమును ప్రతాపరుద్రగజపతి పిన్నతండ్రి తిరుమలకాంతరాయఁడు విని గజపతి కావార్తను బంపి తా నుదయగిరి దుర్గమును బలషఱుచుకొని పదివేల