ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

తిమ్మరుసు మంత్రి


ఇట్లు హెచ్చరించి సైన్యము నేఁడు భాగములుగా విభజించి యొక్కొక్క భాగమునకుఁ ముప్పదివేలకాల్బలమును, నాలుగువేలగుఱ్ఱపుదళమును, ఇన్నూరేనుఁగులు నుండునట్లు నియమించెను. ఈయేఁడు భాగములకును కందనోలు పురాధీశ్వరుండైన ఆర్వీటి శ్రీరంగరాజు, నంద్యాలపురాధీశ్వరుండైన ఆర్వీటి నారపరాజు, ఆకువీడు దుర్గాధ్యక్షుఁడై ఇమ్మరాజు, రాయసము తిమ్మరుసుమంత్రి కుమారుడైన కొండమరాజు (కొండమరుసు), గండికోట దుర్గాధ్యక్షుఁడైన పెమ్మసాని రామలింగన్ననాయఁడు, వెలుగోటి దుర్గాధ్యక్షుఁడైన రేచర్ల కుమార తిమ్మానాయఁడు, రూపనారాయణ బిరుదాంచితుఁ డగు గంగాధరరెడ్డి (గంగారెడ్డియు) నను నేడ్వుఁరకు నాధిపత్య మొసంగి ముఖ్యసేనాధిపతులనుగఁ జేసెను. వీరలలో శ్రీరంగరాజు, నారపరాజు, ఇమ్మరాజును, నరపతివంశీయులై నరాజులు, రాయసము కొండమరుసు ఉదయగిరి కన్నడి నియోగిశాఖా బ్రాహ్మణుఁడు; పెమ్మసాని రామలింగన్న కమ్మనాయకుఁడు, వెలుగోటి కుమారతిమ్మానాయఁడు పద్మనాయకుఁడు, గంగాధరరెడ్డి పంటకులాన్వయుఁడైన రెడ్డినాయకుఁడు. వీరికి లోఁబడిన సేనాను లింకను బ్రాహ్మణులలోను బ్రాహ్మణేతరులలోను బెక్కండ్రు గలరు. ఇట్లు తిమ్మరుసు చేసిన యేర్పాటులకు శ్రీకృష్ణదేవరాయఁడు హర్షించి నాటికి దర్బారు ముగించి నిజాంతఃపురమునకు వెడలిపోయెను.


___________