ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

తిమ్మరుసు మంత్రి


సేనాధిపత్య పట్టబంధనము

అట్లనుజ్ఞాతుఁడై నగరపాలకుఁడు దండయాత్రను నగరంబునఁ జాటింపించి రణభేరి మ్రోగింప నుత్తరు విచ్చెను. సేనాపతు లెల్లరును దమతమ సైన్యములతో సంసిద్ధులై యుండిరి. ఒకనాఁటి శుభముహూర్తమున వజ్రసింహాసనారూఢుఁడై శ్రీకృష్ణదేవరాయఁడు పురోహితులు, మంత్రులు, సామంతులు, సేనాధిపతులు, రాజబంధువులు, అధికారవర్గము, తక్కుంగల పరివారజనంబులు తన్నుఁగొలువఁ గొలువుండి కనకకలశంబులఁ బావనజలంబులఁ దెప్పించి మంగళోపకరణశోభితంబు గావించి బ్రాహ్మణజనంబుల పుణ్యాహనాదంబులును, పరమాశీర్వాదంబులును, వందిజనస్తుతిపాఠంబులును, మాగధగీతంబులును జెలంగఁ దిమ్మరుసుమంత్రి వరేణ్యునకు సేనాధిపత్యాభిషేకపట్ట బంధం బొనర్చెను. అత్తరి నాయకవర్గంబు నిజశంఖంబులఁ బూరించిన సఖలసైన్యంబులందును భేరీమృదంగపణవాది తూర్య నినాదంబులు నిగిడి నింగి ముట్టెను. ఇట్టు తన్నుఁ బెద్దగా నెన్ని సర్వసేనాధిపత్య మొసంగినందులకుఁ సంతుష్టహృదయుఁడై తిమ్మరుసు రాయని కాయురారోగ్యైశ్వర్యాభివృద్ధియు, సామ్రాజ్యాభివృద్ధియుఁ గలుగునటులు దీవించి సేనాధిపతుల వీక్షించి యిట్లు హెచ్చరించెను.

'దండనాధాగ్రణులారా! విజాపురసుల్తాను ఆదిల్‌షాహ రాచూరు, ముదిగల్లుదుర్గముల నాక్రమించుకొని రాజధానీనగర సమీపస్థుఁడై ప్రక్కలో బల్లెమై కూరుచుండియున్నవాఁడు.