ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిమ్మరుసుమంత్రి

ప్రథమప్రకరణము.

"చ. కరచరణాదు లందఱకుఁ గల్గినయంతట నే సమర్ధతన్
     మెరువడి గాంచ నేర్తురొ మనీషివరుల్ ధరలోన నెవ్వరి
     క్కరణిఘటింపుచుం గృతయుగంబునఁ ద్రేతను ద్వాపరంబునం
     దరయఁగ సాళ్వతిమ్మసచి వాగ్రణికి స్సరిమంత్రి గల్గునే?"
                                                               (కుమారధూర్జటి.)

"సీ. ఏమంత్రిమణి నిజస్వామికార్యక్రియాతత్ఫరమానసోత్సాహశాలి
     యే మంత్రిమణి మిత్రహితబాంధవాశ్రితప్రకరరక్షణకణా ప్రౌడబుద్ది
     యే మంత్రిమణి వచోహేలాతినై ర్మల్య శీతలతాధూతశీతరోచి
     యే మంత్రిమణి సుధాధామశాంభవదామ ధాళధళ్యసుతుల్యధవళకీర్తి.

     యట్టిమంత్రికులోత్తంస మహితనృపతి
     పటలమకుటాగ్రఘటితపత్పద్మయుగళి
     సకలకర్ణాటరక్షావిచక్షణుండు
     దీనసురశాభి సాళువ తిమ్మమంత్రి."
                                       (మాదయగారిమల్లనకవి.)

తిమ్మరుసువంశము.

తిమ్మరుసు పూర్వులు సాళ్వవంశీయులైన మహారాజుల యొద్ద మంత్రిత్వాదిపదవులను వహించి సుప్రసిద్ధకీర్తిఁ గన్న వా రగుటచేత వీరివంశమునకు సాల్వవంశ మని పేరు వచ్చినది. ఈ వంశమువారికిఁ దొలుత కొండవీటిసీమయె స్వస్థానముగ నుండెను. ఈసాల్వవంశమువారు కౌండిన్యసగోత్రులైనయాఱ్వేల