ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమప్రకరణము

99


దుర్గములన్నియు సమస్త వస్తుసామగ్రులతోడ నింపి సమృద్ధము లగునట్లు గావించితిని. సేనాపతు లెల్లరును భక్తివిశ్వాసపరులైన శూరశిఖామణులై యున్నారు. మన కేవిధమునను గొఱంత గానరాదు. శత్రువు లెంతటి బలాఢ్యులైనను వారిని నేఁ డవలీల జయింపగలవు. పరరాష్ట్రాధిపతులు నిన్నుఁ గన్నెత్తి చూడనోడుదురు. శత్రురాజులు నాయెడల నీకు నీసు గల్పించి తగవులు పెట్టి సామ్రాజ్యమును జెఱుపఁ బ్రయత్నించిరి గాని వారి దుష్ప్రయత్నములన్నియు వ్యర్థములై పోయినవి. నేను నీయెడ భక్తివిశ్వాసపరుఁడనై వ్యవహరించినదియు లేనిదియు నీవే యెఱుంగుదువు. ఎవ్వరిని సంపూర్ణముగా జయింపఁజాలక పోతి మని నీపూర్వులైన సాళ్వనరసింహరాయాదులు పరితపించి గతాసువులైరో అట్టి యశ్వపతులను గజపతులను నీవు జయించి యీయభినవకర్ణాటహైందవ సామ్రాజ్యమునకు వన్నెయు వాసియుఁ గల్పించి లోకంబున శాశ్వతకీర్తిని సముపార్జింపుము.

అని తిమ్మరుసు ప్రోత్సహించి పలుకు పలుకులకుఁ బ్రీత చేతస్కుఁడై రాయఁడు 'అప్పా! ఎదిరిబలము నాబలము నెఱుంగక నాఁడట్లు శత్రువులను జయింప సమకట్టి నీతోఁ బ్రశంసించితిని. నాఁడు నీవు నాతమకమును వారించి ప్రబోధింపక నాచిత్తము వచ్చినట్లు వ్యవహరింప విడిచినపక్షమున నిప్పటికి నాపాట్లెట్లుండునో గదా! ఈరెండు సంవత్సరములలో నీవు చేసినకార్యములు శ్లాఘాపాత్రములైనవిగా నున్నవి. నీకు